నువ్వు ప్రపంచకప్ గెలవకుంటే ఏం..? నీ ఆట చూడటం దేవుడిచ్చిన వరం : రొనాల్డోపై కోహ్లీ భావోద్వేగ పోస్టు
Virat Kohli - Cristiano Ronaldo: క్రికెట్, ఫుట్‌బాల్ ఆటలో ఇద్దరు దిగ్గజాలుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డోకు ఒక సారుప్యత ఉంది. ఇద్దరు వాళ్లు ఆడుతున్న ఆటలో దిగ్గజాలే.. మరెవరూ సాధించని రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు.
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా ఒకడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో భాగంగా పోర్చుగల్ సారథిగా బరిలోకి దిగిన రొనాల్డో.. తన కల (ప్రపంచకప్ సాధించడం) తీరకుండానే వెనుదిరిగాడు. శనివారం మొరాకోతో జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ 0-1 తేడాతో ఓడటంతో రొనాల్డో ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలో అతడి అభిమానులు రొనాల్డోకు ధైర్యం చెబుతున్నారు. టోర్నీ గెలవకున్నా నువ్వు మా గుండెల్లో ఉంటావని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కోహ్లీ కూడా సోషల్ మీడియాలో రొనాల్డోకు అండగా నిలిచాడు.
రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ లో.. ‘క్రీడా రంగానికి, క్రీడాభిమానులను నువ్వు అలరించిన తీరును ఏ ట్రోఫీ, టైటిల్ తీసివేయదు. నాలాంటి ఎంతో మంది మీద నువ్వు చూపిన ప్రభావాన్ని ఏ శీర్షిక కూడా వెల్లడించదు. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం...
ప్రతీ మ్యాచ్ లోనూ ఆట పట్ల నువ్వు చూపే అంకితభావం, నీ శ్రమ మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం న్యాయం చేసేందుకు పరమావధిగా భావించిన నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను అలరిస్తున్నావు. నీఆటను చూడటం మాకు దేవుడిచ్చిన వరం.. నా దృష్టిలో నువ్వే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్)..’ అని రాసుకొచ్చాడు.
కోహ్లీ ఈ పోస్టు చేయగానే లక్షల్లో లైకులు, కామెంట్లు హోరెత్తాయి. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రొనాల్డో, కోహ్లీ ఫ్యాన్స్ రొనాల్డోకు అండగా నిలుస్తున్నారు. ప్రిక్వార్టర్స్ లో స్విట్జర్లాండ్ తో, క్వార్టర్స్ లో మొరాకోతో చాలాసేపు బెంచ్ కే పరిమితమైన రొనాల్డో.. క్వార్టర్స్ లో ఓడిన తర్వాత కన్నీటిపర్యంతమయ్యాడు.
ఇక క్రికెట్, ఫుట్‌బాల్ ఆటలో ఇద్దరు దిగ్గజాలుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డోకు ఒక సారుప్యత ఉంది. ఇద్దరు వాళ్లు ఆడుతున్న ఆటలో దిగ్గజాలే.. మరెవరూ సాధించని రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేస్తే రొనాల్డో వందలాది గోల్స్ చేశాడు. అటు మైదానంలో గానీ, మైదానం వెలుపల గానీ ఈ ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే ఇద్దరికీ ఉన్న లోటు ప్రపంచకప్ గెలవకపోవడం..
రొనాల్డో వయసు ఇప్పుడు 37 ఏండ్లు. 2026 ఫిఫా ప్రపంచకప్ వరకు రొనాల్డో ఆడేది అనుమానమే. దీంతో అతడికి ఇదే చివరి ప్రపంచకప్. ఇక కోహ్లీ వయసు ఇప్పుడు 34 ఏండ్లు. కోహ్లీ ఖాతాలో కూడా ఐసీసీ ట్రోఫీ లేదు. 2011 వన్డే ప్రపంచకప్ లో కోహ్లీ సభ్యుడుగా ఉన్నా అప్పుడే జట్టులోకి కొత్తగా వచ్చాడు. ఆ తర్వాత భారత్ రెండు వన్డే ప్రపంచకప్ లు, ఐదు టీ20 ప్రపంచకప్ లు ఆడినా కోహ్లీకి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ పై కోహ్లీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. 2024లో టీ20 ప్రపంచకప్ కోహ్లీ ఆడేది అనుమానమే. ఇక స్వదేశంలో, విదేశాల్లో సిరీస్ లు గెలిచినా ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే కారణంతోనే బీసీసీఐ.. కోహ్లీని సారథిగా తప్పించిన విషయం తెలిసిందే.