Asianet News TeluguAsianet News Telugu

సారీ పూజారా, నిన్ను అలా పిలిచినందుకు క్షమించు... యార్క్‌షైర్ క్రికెటర్ జాక్ బ్రూక్స్...

యార్క్‌షైర్‌ కౌంటీ క్లబ్‌కి ఆడే సమయంలో ఛతేశ్వర్ పూజారాకి ‘స్టీవ్’ అనే నిక్‌నేమ్... దాని వెనకాల జాతి వివక్ష ఉందంటూ అజీమ్ రఫీక్ ఆరోపణలు... బహిరంగంగా క్షమాపణలు చెప్పిన యార్క్‌షైర్ మాజీ క్రికెటర్...

Yorkshire County Club Issue, England pacer apologies Cheteshwar pujara for naming Steve
Author
India, First Published Nov 19, 2021, 6:07 PM IST

ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్ వివాదం, రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్‌లతో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, ఆసియా క్రికెటర్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవారని, జాతివివక్ష చూపించేవారని మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ చేసిన కామెంట్లు, పెను దుమారం క్రియేట్ చేస్తున్నాయి. 2008 నుంచి 2018 వరకూ యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ తరుపున ఆడిన అజీమ్ రఫీక్,  పార్లమెంటరీ కమిటీ ముందు తాను ఎదుర్కొన్న జాతి వివక్ష అనుభవం గురించి పంచుకున్నాడు.

Read: అతను ముందే చెప్పాడు, నేనే నమ్మలేదు... హర్భజన్ సింగ్‌పై వెంకటేశ్ అయ్యర్ కామెంట్...

156 మ్యాచుల్లో 208 వికెట్లు తీసిన రఫీక్, కేవలం జాతి వివక్ష కారణంగానే ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడలేకపోయానంటూ ఆరోపించాడు.  తాను క్లబ్‌కి ఆడుతున్న సమయంలో అలెక్స్ హేల్స్, గ్యారీ బ్యాలెన్స్ వంటి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు ఆసియా ఖండానికి చెందిన క్రికెటర్లను ‘కెవిన్’ అంటూ పిలిచేవారంటూ ఆరోపించాడు అజీమ్ రఫీక్... అలెక్స్ హేల్స్‌ పెంచుకున్న ఓ నల్ల కుక్క పేరు కూడా అదే కావడంతో, తమను కుక్కలతో సమానంగా భావించి... అలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవారంటూ ఆరోపించాడు అజీమ్ రఫీక్...
 
‘నేను క్లబ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఛతేశ్వర్ పూజారా ఆ క్లబ్‌లో చేరాడు. అతనితో పాటు జాక్ బ్రూక్స్ కూడా. అప్పుడు అతన్ని మిగిలిన ప్లేయర్లు ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లు. స్టీవ్ అంటే వాళ్ల దృష్టిలో పనివాడు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అజీమ్ రఫీక్...  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కూడా పూజారాకి యార్క్‌షైర్‌లో ఎదురైన అనుభవాన్ని, 2020-21 సమయంలో భారత్, ఆస్ట్రేలియాలో పర్యటించిన సమయంలో బయటపెట్టేవాడు...

‘భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా ఇంగ్లీష్ కౌటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కి ఆడేవాడు. అప్పుడు అతని పేరు పలకడం ఇంగ్లీష్ ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది...  ఛతేశ్వర్ అని పిలవడం రాక... ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లు...’ అంటూ వ్యాఖ్యానించాడు షేన్ వార్న్... అయితే షేన్ వార్న్ చెప్పిన ‘స్టీవ్’ పదం వర్ణ వివక్షకు సంబంధించనది కావడంతో ఆ సమయంలోనే షేన్ వార్న్ కామెంట్లపై దుమారం రేగింది.  యార్క్‌షైర్‌లో ఇంగ్లీష్ ప్లేయర్లు, ఆసియా, ఆఫ్రికా ప్లేయర్లను వేరు చేసేందుకు ఇలా పిలిచేవారని తేలింది...

ఛతేశ్వర్ పూజారా మాత్రం యర్క్‌షైర్ క్లబ్‌కి ఆడినప్పుడు తనకి ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని, తాను కౌంటీలకు ఆడడాన్ని ఫుల్లుగా ఆస్వాదించానంటూ కామెంట్ చేయడం విశేషం... అజీమ్ రఫీక్ ఆరోపణలతో సోమర్‌సెట్ క్లబ్ పేసర్ జాక్ బ్రూక్స్, ఛతేశ్వర్ పూజారాకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

‘అజీమ్ రఫీక్ స్టేట్‌మెంట్ గురించి తెలిసి షాక్ అయ్యాను. పలకడానికి రాని పేర్లు ఉన్న వారికి ‘స్టీవ్’ అని నిక్‌నేమ్ పెట్టడం డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ అలవాటు. అందులో ఎలాంటి జాతి వివక్ష, జాత్యాహంకారం లేదు. నేను, ఛతేశ్వర్‌ను ‘స్టీవ్’ అని పిలిచేవాడినని ఒప్పుకుంటున్నా. అలా పిలిచినందుకు అతను ఏమైనా ఇబ్బందిపడి ఉంటే, క్షమించాలని కోరుతున్నా. అతన్ని అలా పిలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదు. అయితే అది ఆమోదయోగ్యం కాదని తెలిసింది...’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేశాడు జాక్ బ్రూక్స్..


అలాగే అలెక్స్ హేల్స్ కూడా తన పెంపుడు కుక్క పిల్లకి ‘కెవిన్’ అనే పేరు పెట్టడం వెనక ఎలాంటి జాతివివక్ష కోణం లేదని స్పష్టం చేశాడు.. ‘నా కుక్క పిల్ల నల్లగా ఉందని కెవిన్ అని పేరు పెట్టానని చాలా మంది అన్నారు. నాకు అలాంటి ఆలోచనే లేదు. అజీమ్ రఫీక్ ఎదుర్కొన్న ఇబ్బందికి నేను సానుభూతి తెలియచేస్తున్నా. విచారణకు సహకరించేందుకు నేనెప్పుడూ సిద్ధమే...’ అంటూ కామెంట్ చేశాడు అలెక్స్ హేల్స్... 

Follow Us:
Download App:
  • android
  • ios