క్రికెట్లో రాణించాలంటే ఆటగాళ్లకు మంచి ఫిట్ నెస్  అవసరం. అందుకోసం వారు ఎక్కువగా జిమ్  లలో గడపడం, ప్రత్యేకంగా ఫిట్ నెస్ జాగ్రత్తలు తీసుకోవడం చేస్తుంటారు. అయితే తాను వీటన్నింటిని ఫాలో కాకుండానే ఇంత  ఆరోగ్యంగా వుండటంతో పాటు క్రికెట్లోనూ రాణిస్తున్నానని విద్వంసకర విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ బయటపెట్టాడు. తాను ఆరోగ్యంగా, ప్రశాంతంగా వుండేందుకు నిత్యం యోగా చేస్తుంటానని తెలిపాడు. అదే తాను ఒత్తిడిని తట్టుకుని బ్యాటింగ్ లో రాణించేలా ధోహదపడుతోందని ఈ  విండీస్ వీరుడు తెలిపాడు.  

మరికొద్దిరోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో గేల్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి.  అతడు ఫిట్ గా లేకపోవడం వల్ల విండీస్ తరపున ప్రపంచ కప్ ఆడే అవకాశాలు తక్కువగా వున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై  తాజాగా స్పందించిన గేల్...తన ఫిట్ నెస్ పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. నేను ఫిట్ నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలే తీసుకోని మాట నిజమేనని...అందేవల్ల తాను ఫిట్ గా  లేననడం సరికాదన్నాడు. శారీరకంగానే కాదు మానసికంగానూ తానే దృడంగా వున్నట్లు గేల్ పేర్కొన్నాడు. 

'' సుధీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న నా అనుభవమే నాకు అధిక బలాన్నిచ్చే అంశం. ఇక భారీ షాట్లతో విరుచుకుపడేందుకు మానసిక ప్రశాంతత తోడ్పడుతుంది. అందరు ఆటగాళ్ల మాదిరిగా నేను నిత్యం జిమ్  లో గడపను. గత కొంతకాలంగా అయితే అసలు జిమ్‌కు వెళ్లడమే మానేశా. అయినా నాకు ఆరోగ్య, మానసిక పరంగా ఎలాంటి ఇబ్బందులు  లేవు. అందుకు కారణం ఎక్కువ విశ్రాంతి తీసుకోవడంతో పాటు నిత్యం యోగా చేయడమే'' అని  గేల్ తన ఆరోగ్య, ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు.

క్రిస్ గేల్ వెస్టిండిస్ జట్టు తరపున మరో వరల్డ్ కప్ ఆడటానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే నాలుగు ప్రపంచ కప్ లు ఆడిన అతడికి ఇది ఐదోది. ఇందులో గేల్ విండీస్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలా జరిగితే ఇదే గేల్ ఆడే చివరి  వరల్డ్ కప్ కానుంది.