ముంబై: ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో బంగ్లాదేశ్ అతిగా స్లెడ్జింగ్ చేసిన్నప్పటికీ తాను ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడానికి కారణమేమిటో యశస్వి జైశ్వాల్ తెలిపాడు. మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వల్లనే తాను నిలకడగా ఆడగలిగానని ఆయన చెప్పాడు. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ద ట్రోనీ అవార్డు పొందాడు.

"ద్రవిడ్, సచిన్ సార్ల వల్లనే నేను అలా ఆడగలిగాను. బ్యాటుతో మాట్లాడాలి నోటితో కాదని వాళ్లు నాకు చెప్పారు. ఆ సలహాకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ప్రశాంతంగా బ్యాట్గింగ్ చేశా. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా" అని ఆయన వివరించాడు.

బంగ్లాదేస్ స్లెడ్జింగ్ చేస్తున్నా తాను స్పందించలేదని, ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి పరుగులు చేయాలని మాత్రమే భావించానని, ఆ సమయంలో తనలో ఆ ఒక్క ఆలోచన మాత్రమే ఉందని ఆయన చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో యశస్వి జైశ్వాల్ ఆ విషయాలు వెల్లడించాడు.

ఫైనల్లో బంగ్లాదేశ్ విజయం సాధించిన తర్వాత సంభవించిన అవాంఛనీయమైన సంఘటనలపై కూడా ఆయన స్పందించాడు.  ప్రతి ఆటగాడు స్వీయ స్వీయ క్రమశిక్షణను పాటించాలని, ప్రత్యర్థి విజయాన్ని అభినందించాలని, తమ జట్టు విజయాన్ని ఆనందించాలని ఆయన అన్నాడు.

బంగ్లాదేశ్ జరిగిన ఫైనల్ మ్యాచులో ఇండియా టాప్ ఆర్డర్ తో పాటు మిడిలార్డర్ కూడా విఫలమైంది. అయితే, ప్రత్యర్థులు దూషణలతో కవ్విస్తున్నప్పటికీ జైశ్వాల్ జాగ్రత్తగా ఆడుతూ 88 పరుగులు చేశాడు.