WTC Final 2023: మొదటి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం... ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ భారీ భాగస్వామ్యంతో...
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... ట్రావిస్ హెడ్ అజేయ శతకం, సెంచరీ దిశగా సాగుతున్న స్టీవ్ స్మిత్..

ఎన్నో అంచనాలతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023ని ప్రారంభించిన టీమిండియా, మొదటి రోజు పూర్తిగా తేలిపోయింది. టాస్ గెలిచినా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన రోహిత్ శర్మ, బౌలర్ల నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాబట్టలేకపోయాడు..
దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ట్రావిస్ హెడ్ 156 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 146 పరుగులు చేసి అదరగొట్టగా స్టీవ్ స్మిత్ 227 బంతుల్లో 14 ఫోర్లతో 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
స్టీవ్ స్మిత్ సెంచరీ దిశగా సాగుతుంటే, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఈ ఇద్దరూ 370 బంతుల్లో 251 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. మొదటి రోజు రెండో సెషన్ రెండో ఓవర్‌లో వికెట్ తీసిన భారత బౌలర్లకు, ఆ తర్వాత వికెట్ దక్కలేదు.
మొదటి సెషన్‌లో 2, రెండో సెషన్‌లో ఓ వికెట్ తీయగలిగిన భారత బౌలర్లు, ఓవరాల్‌గా మొదటి రోజు ఆటలో తేలిపోయారు. ఆస్ట్రేలియా చేతిలో ఇంకా 7 వికెట్లు ఉన్నాయి. క్రీజులో ఉన్న ఇద్దరితో పాటు కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ వరకూ అందరూ చక్కగా బ్యాటింగ్ చేయగలరు. దీంతో రెండో రోజు భారత బౌలర్లు ఎంత కమ్‌బ్యాక్ ఇచ్చినా ఆస్ట్రేలియా ఈజీగా 450-500+ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది..
ఇదే జరిగితే టీమిండియా, డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు కోల్పోయింది. ఇంగ్లాండ్ పిచ్ మీద భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అంత స్కోరు చేయడం చాలా కష్టం. అదీకాకుండా మూడో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా విధించే లక్ష్యాన్ని నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేదించడం మరింత కష్టంగా మారుతుంది..
ట్రావిస్ హెడ్‌కి ఇది ఆరో టెస్టు సెంచరీ కాగా విదేశాల్లో మొట్టమొదటిది. టీమిండియాపై కూడా ట్రావిస్ హెడ్‌కి ఇదే మొదటి సెంచరీ. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించాడు. 10 బంతులు ఆడిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో 4 ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.
60 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్నస్ లబుషేన్ వికెట్ కోసం రెండు సార్లు డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే ఓసారి అంపైర్ కాల్స్‌గా రావడంతో బతికిపోయిన లబుషేన్, మరోసారి లక్కీగా బంతి వికెట్లను మిస్ కావడంతో లైఫ్ దక్కించుకున్నాడు...
లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. లంచ్ బ్రేక్ తర్వాత వస్తూనే లబుషేన్‌ని అవుట్ చేశాడు మహ్మద్ షమీ. 62 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్, వస్తూనే వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్న ట్రావిస్ హెడ్, మరో 46 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు.