Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ వీరులు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.. గిల్, కోహ్లీ, రోహిత్, పుజారా చెత్త ప్రదర్శన

WTC Final 2023: రెండు వారాల క్రితమే భారత్ లో ముగిసిన ఐపీఎల్-16 లో  పోటీ పడి పరుగులు సాధించిన భారత బ్యాటర్లు అసలు సమరంలో మాత్రం తేలిపోయారు. 

WTC Final 2023: IPL Heroes Falling Cheaply in Oval, India in Trouble MSV
Author
First Published Jun 8, 2023, 9:57 PM IST

గతనెల భారత్ లో ముగిసిన ఐపీఎల్ - 16 లో   టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, యువ ఓపెనర్  శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారించారు.  ఇద్దరూ పోటీ పడి మరీ సెంచరీలు చేశారు. బౌలర్ ఎవరనేది  చూడకుండా  బరిలోకి దిగితే  మినిమం హాఫ్  సెంచరీ పక్కా అన్న రేంజ్ లో సాగింది వీళ్ల విధ్వంసం. ఈ ఇద్దరంత కాకపోయినా రోహిత్ కూడా ఓ మోస్తారుగా రాణించాడు. ఆడింది కొద్ది మ్యాచ్ లలోనే అయినా  ధాటిగా ఆడాడు.  

ఈ ముగ్గురితో పాటు టీమిండియా నయా వాల్  ఛతేశ్వర్ పుజారా కౌంటీలలో  సెంచరీల మీద సెంచరీలు బాదాడు. ఈ నలుగురి జోరు చూస్తే ఆస్ట్రేలియాకు  తిప్పులు తప్పవనే అనిపించింది. 

ఐపీఎల‌్‌లో ఇలా...

ఐపీఎల్- 16 సీజన్ లో గిల్.. 16 మ్యాచ్ లు ఆడి 16 ఇన్నింగ్స్ లో 60కి  పైగా సగటుతో  851 పరుగులు చేశాడు. ఈ ఏడాది వన్డేలు, టీ20లు, టెస్టులలో  చేసిన సెంచరీలను ఐపీఎల్ లో కూడా కొనసాగించాడు. గిల్ భీకర ఫామ్ లో  మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక కోహ్లీ విషయానికొస్తే.. ఈ ఏడాది  ఆరంభంలో న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో కూడా సెంచరీ చేశాడు.  ఐపీఎల్ -16 లో కోహ్లీ..  14 మ్యాచ్ లు ఆడి   14 ఇన్నింగ్స్ లలో  56 సగటుతో 639 రన్స్ చేశాడు. కోహ్లీ సైతం బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో జోరుమీదే ఉన్నాడు.  

కోహ్లీ - గిల్ లే గాక ఐపీఎల్ - 16 లో భాగస్వామి కాకపోయినా ఇంగ్లాండ్ లో కౌంటీ  ఛాంపియన్‌షిప్ ఆడిన  పుజారా..  ఈ సీజన్ లో ససెక్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఐదు మ్యాచ్ లలో మూడు సెంచరీలు చేశాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో..

వీళ్ల ఫామ్ చూసి ఆహా ఓహో అనుకున్న టీమిండియా అభిమానులు.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ కు తిరుగుండదు, ఆసీస్ కు  చుక్కలే అని భ్రమించారు.  కానీ మన ఐపీఎల్ వీరులు, కౌంటీలో సెంచరీలు బాదిన పుజారా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యారు.  డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 469 పరుగులు చేసింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో మనోళ్లు కూడా రాణిస్తారని అనుకున్నారంతా.. కానీ  తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ , గిల్, కోహ్లీ, పుజారాలు కలిపి చేసిన స్కోరు పరుగులు 56 మాత్రమే. 

రోహిత్ శర్మ 26 బంతుల్లో 15 పరుగులు చేయగా  గిల్  15 బంతుల్లో 13 రన్స్ చేశాడు. పుజారా 25 బంతుల్లో 14  పరుగులే  చేసి నిష్క్రమించాడు.  ఇక భారత జట్టు భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీ.. 31 బంతుల్లో 14 పరుగులకే ఔటయ్యాడు. 

ఈ నలుగురు ప్రధాన బ్యాటర్లు నిష్క్రమించడంతో భారత జట్టు 28 ఓవర్లు ముగిసేసరికి  నాలుగు వికెట్ల నష్టానికి   111 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (31 నాటౌట్), రహానే (17 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఇంకా  358 పరుగులు వెనుకబడి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios