Asianet News TeluguAsianet News Telugu

పతనం మొదలైంది.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్లు.. టీ విరామానికి స్కోరు ఎంతంటే..

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నా ఓపెనింగ్ జోడీ మాత్రం విఫలమైంది.

WTC Final 2023: Disappointed Start From Team India, Men In Blue Loss Early Wickets  in 2nd Session MSV
Author
First Published Jun 8, 2023, 7:57 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో  భాగంగా ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసిన పిచ్ పై భారత్ తడబడుతోంది. తొలి రోజు విఫలమైన బౌలర్లు రెండో రోజు పుంజుకున్నా  భారీ స్కోరును కరిగించే పనిలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు దారుణంగా విఫలమయ్యారు.   ఈ ఇద్దరూ ధాటిగా ఆడేందుకు యత్నించినా  ఆసీస్ పేసర్ల జోరు ముందు నిలవలేకపోయారు.  

26 బంతుల్లో 2 బౌండరీల సాయంతో  15 పరుగులు చేసిన  రోహిత్‌ను ఆసీస్ సారథి పాట్ కమిన్స్  ఔట్ చేశాడు. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో  చివరి బంతికి   రోహిత్ ఎల్బీగా  ఔట్ అయ్యాడు. 

మరుసటి ఓవర్ వేసిన స్కాట్ బొలాండ్.. భారత్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఈ ఏడాది నిలకడగా ఆడుతున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ను అతడు బోల్తొ కొట్టించాడు.  బొలాండ్ వేసిన   ఏడో ఓవర్ లో నాలుగో బంతికి గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  బొలాండ్ వేసిన బంతి అవుట్ సైడ్ ఆఫ్ లో పిచ్ ను తాకినా అది వికెట్ల లోపలకు దూసుకొచ్చి   వికెట్లను గిరాటేసింది. దీంతో  కళ్లప్పగించి చూడటం గిల్ వంతైంది.  

30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. నేడు  మూడో సెషన్  మొత్తం ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ (4 నాటౌట్), పుజారా (3 నాటౌట్)  క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి  భారత్.. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి  37 పరుగులు చేసింది.  నేటి ఆటలో మరో 41 ఓవర్లు మిగిలున్నాయి. మరి  సీనియర్  బ్యాటర్లు పుజారా, కోహ్లీ.. లు ఆసీస్ పేస్ దళాన్ని  ఏ మేరకు నిలువరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. 

 

కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 121.3 ఓవర్లలో 469 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్   (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలకు తోడు  వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (48) , డేవిడ్ వార్నర్ (43) రాణించారు. ఆట తొలి రోజు అయిన నిన్న మూడు వికెట్లు మాత్రమే తీసి విఫలమైన భారత పేసర్లు నేడు మాత్రం రాణించారు. హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్   నాలుగు వికెట్లతో చెలరేగాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios