స్మిత్, హెడ్ ఔట్.. ఇక మిగిలింది వాళ్లే.. దారికొచ్చిన భారత బౌలర్లు..
WTC Final 2023: భారత్ - ఆసీస్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు మార్నింగ్ సెషన్ లో భారత బౌలర్లు రాణిస్తున్నారు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భాగంగా తొలి రోజు తేలిపోయిన భారత బౌలర్లు రెండో రోజు మాత్రం దారికొచ్చినట్టే కనిపిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే భారత పేసర్లు మూడు వికెట్లు తీసి ఆసీస్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు. ఆట ఆరంభం కాగానే రెండు బౌండరీలతో సెంచరీ చేసిన స్మిత్ తో పాటు 150 పూర్తి చేసిన ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ ల వికెట్లను పడగొట్టారు.
327-3 ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్.. అదే జోరును కొనసాగించింది. సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన స్మిత్ తన టెస్టు కెరీర్ లో 31 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో నిన్న 144 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించిన ట్రావిస్ హెడ్ కూడా షమీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 150 పూర్తి చేసుకున్నాడు.
ధాటిగా ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన 92వ ఓవర్లో హెడ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్మిత్ తో కలిసి హెడ్ నెలకొల్పిన 285 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హెడ్ స్థానంలో వచ్చిన కామెరూన్ గ్రీన్.. 7 బంతుల్లో ఆరు పరుగులే చేసి షమీ వేసిన 95వ ఓవర్లో రెండో బాల్ కు స్లిప్స్ లో శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. ఇక గ్రీన్ నిష్క్రమించిన తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన 99వ ఓవర్లో మొదటి బంతికే స్మిత్ కూడా బాల్ ను వికెట్ల మీదుగా ఆడుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 268 బంతులు ఆడిన స్మిత్.. 19 బౌండరీల సాయంతో 121 పరుగులు చేశాడు. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించి లోయారార్డర్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపింతే టీమిండియా రెండో సెషన్ ముగిసేవరకైనా బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలుంటాయి.
ప్రస్తుతం ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (12 నాటౌట్) తో కలిసి మిచెల్ స్టార్క్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత వచ్చే పాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలడు. మరి స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు కంగారూల తోకను ఎంత త్వరగా కత్తిరిస్తారో చూడాలి. 102 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. ఆరు వికెట్లు నష్టపోయి 398 పరుగులు చేసింది.