Asianet News TeluguAsianet News Telugu

హమ్మయ్య.. ఆసీస్ ఆలౌట్ అయింది.. కొండను కరిగించాలంటే కష్టపడాల్సిందే..

WTC Final 2023:  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఎట్టకేలకు ఆలౌట్ అయింది. 

WTC Final 2023: Australia All Out at 469, Siraj Took 4fer  MSV
Author
First Published Jun 8, 2023, 6:48 PM IST

భారత బౌలర్లను వీరబాదుడు బాదిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎట్టకేలకు ఆలౌట్ అయ్యారు. ట్రావిస్ హెడ్   (163), స్టీవ్ స్మిత్ (121) సెంచరీలకు తోడు  వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (48) , డేవిడ్ వార్నర్ (43) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 121.3 ఓవర్లలో 469 పరుగులు చేసి ఆలౌట్ అయింది.   ఆట తొలి రోజు అయిన నిన్న మూడు వికెట్లు మాత్రమే తీసి విఫలమైన భారత పేసర్లు నేడు మాత్రం రాణించారు. హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్   నాలుగు వికెట్లతో చెలరేగాడు. 

రెండో రోజు ఉదయం సెషన్ లో  నాలుగు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. లంచ్ తర్వాత మిగిలిన తోకను కత్తిరించారు.  అలెక్స్ కేరీ.. కాసేపు విసిగించినా  జడేజా అతడికి అడ్డుకట్ట వేశాడు. సిరాజ్ రెండు వికెట్లు వెంటవెంటనే పడగొట్టి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.  

ఓవర్ నైట్ స్కోరు 327-3  వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్.. ఉదయం  స్టీవ్ స్మిత్  సెంచరీ చేయడం, ట్రావిస్ హెడ్  150 పరుగులు  చేయడమే కాస్త ఊరటనిచ్చాయి. భారత పేసర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి  ఆసీస్ బ్యాటర్ల పనిపట్టారు.  

ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన సిరాజ్  టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక అప్పట్నుంచి ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. హెడ్ స్థానంలో వచ్చిన    కామెరూన్ గ్రీన్.. 7 బంతుల్లో  ఆరు పరుగులే చేసి  షమీ వేసిన  95వ ఓవర్లో  రెండో బాల్ కు స్లిప్స్ లో శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు.  ఇక  గ్రీన్ నిష్క్రమించిన తర్వాత శార్దూల్ ఠాకూర్ వేసిన  99వ ఓవర్లో మొదటి బంతికే  స్మిత్ కూడా బాల్ ను వికెట్ల మీదుగా ఆడుకుని  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  268 బంతులు ఆడిన  స్మిత్.. 19 బౌండరీల సాయంతో  121 పరుగులు చేశాడు.

ఇక స్మిత్ స్థానంలో వచ్చిన  మిచెల్ స్టార్క్.. 20 బంతుల్లో ఐదు పరుగులు చేశాడు.  సిరాజ్ వేసిన  104వ ఓవర్లో  ఐదో బంతిక స్టార్క్  సింగిల్ తీయబోతూ  రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ సూపర్  త్రో తో స్టార్క్ వెనుదిరిగాడు.   బౌలర్లను కాసేపు విసిగించిన  కేరీని ఎట్టకేలకు రవీంద్ర జడేజా  115వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు.  ఆ తర్వాత సిరాజ్.. వరుస ఓవర్లలో లియాన్, కమిన్స్ లను  ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.   

 

భారత బౌలర్లలో సిరాజ్ కు నాలుగు వికెట్లు దక్కగా.. షమీ, శార్దూల్ కు తలా రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. అశ్విన్ ను తప్పించి నాలుగో పేసర్ రూపంలో జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ తీయకపోగా ధారాళంగా పరుగులిచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios