ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో రూ.1 కోటి 90 లక్షలకు పూజా వస్త్రాకర్‌ని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానంటున్న ఆమె తండ్రి..
ఐపీఎల్ ద్వారా ఎందరో సత్తా ఉన్న క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. కడు పేదరికం నుంచి కోటీశ్వరులు ఎదిగిన క్రికెటర్ల కథలను తెలుసుకునే అవకాశం దక్కింది. ఎక్కడో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడుకునే టి నటరాజన్, ఒక్కసారిగా టీమిండియా తరుపున ఒకే సిరీస్‌లో మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్‌గా మారిపోయాడు... ఇలాంటి తెర వెనక కథలు, కన్నీటి గాథలు ఎన్నో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి రాబోతున్నాయి...
పురుష క్రికెటర్లు సక్సెస్ కావాలంటే టాలెంట్‌తో పాటు కాస్త లక్ కలిసి వస్తే సరిపోతుంది. అమ్మాయిల విషయంలో అలా కాదు. క్రికెట్‌లో టన్నుల్లో టాలెంట్ ఉన్నా తమ కూతురిని అర్థం చేసుకుని ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ. క్రికెట్ అంటే కేవలం అబ్బాయిల ఆట మాత్రమేనని, అది అమ్మాయిలకు ప్రమాదకరమైన క్రీడగా చూసేవాళ్లు ఎందరో...
అలాంటి ఎన్నో ఆంక్షలు, అవరోధాల నుంచి బయటికి వచ్చి, దేశం తరుపున ఆడే అవకాశాన్ని దక్కించుకున్న ఆడాళ్లకు జోహార్లు చెప్పాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కి చెందిన పూజా వస్త్రాకర్, ఇలాంటి ఎన్నో కష్టాలను అనుభవించింది...
పూజా వస్త్రాకర్‌కి 10 ఏళ్లు ఉన్నప్పుడే ఆమె తల్లి చనిపోయారు. నలుగురు అక్కలు, ఇద్దరు అన్నలకు గారాల చెల్లి అయిన పూజా వస్త్రాకర్‌ని ఎంతో గారాబంగా పెంచాడు ఆమె తండ్రి బంధన్ రామ్ వస్త్రాకర్. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైర్ అయిన బంధన్ రామ్, కూతురిలోని క్రికెట్ టాలెంట్‌ని గుర్తించి ఆమెను ప్రోత్సహించాడు...
2018లో టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన పూజా వస్త్రాకర్, ఇప్పటికి 2 టెస్టులు, 26 వన్డేలు, 40 టెస్టులు ఆడింది. మొత్తంగా 51 వికెట్లు తీసిన పూజా వస్త్రాకర్, బ్యాటుతో 750 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు రూ.1 కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది...
టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు తన తండ్రికి సర్‌ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో రూ.15 లక్షలు పెట్టి ఓ కారు కొనుగోలు చేసింది పూజా వస్త్రాకర్. అయతే డబ్బులు ఎందుకు వేస్ట్ చేశావని ఆమెను తిట్టిన బంధన్ రామ్ వస్త్రాకర్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా వచ్చే డబ్బులను కూతురి పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తానని అంటున్నాడు...
‘నా కూతురు చాలా డబ్బు వృథా చేస్తుంటుంది. చేతిలో డబ్బులు ఉంటే చాలు, అదని, ఇదని ఏదో ఒకటి కొనేస్తూ ఉంటుంది. అందుకే ఈ డబ్బులతో తన పేరిట ఓ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు పూజా వస్త్రాకర్ తండ్రి బంధన్ రామ్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో 409 మంది ప్లేయర్లు పాల్గొనగా అందులో 89 ప్లేయర్లు మాత్రమే అమ్ముడుపోయారు. 5 ఫ్రాంఛైజీలు కలిపి 59.5 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రూ.3 కోట్ల 40 లక్షలు దక్కించుకుని టాప్‌లో నిలబడగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ.1 కోటి 80 లక్షలతో అత్యధిక మొత్తం దక్కించుకున్న భారత ప్లేయర్ల లిస్టులో ఏడో స్థానంలో నిలవడం విశేషం..
