BCCI: గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.   పురుషుల వలే  మహిళలకు కూడా   ఫ్రాంచైజీ క్రికెట్  రాబోతున్నది. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరే మహిళా క్రికెటర్ల కోసం బీసీసీఐ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ను తీసుకొచ్చింది. దీనికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అని పేరుపెట్టింది. గత కొంతకాలంగా ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నా.. నేడు డబ్ల్యూపీఎల్ లో కీలక అడుగు పడింది. నేడు ముంబైలో డబ్ల్యూపీఎల్ లో పాల్గొనబోయే టీమ్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. పురుషుల ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా నగరాల పేరిట ఫ్రాంచైజీలను తీసుకొచ్చారు. ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించాడు. 

జై షా తన ట్విటర్ లో.. ‘బీసీసీఐ మహిళల క్రికెట్ లీగ్ ను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)గా నామకరణం చేసింది. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కేవలం భారత్ లోని మహిళా క్రికెటర్ల కోసమే కాకుండా మొత్తం క్రీడా సోదరీమణుల కోసం ఇది ఒక పరివర్తనాత్మక ప్రయాణానికి మార్గం. డబ్ల్యూపీఎల్ మహిళా క్రికెట్ లో పెను మార్పులను తీసుకువస్తుంది.. 

ఈ రోజు క్రికెట్ లో చారిత్రత్మకమైన రోజు. డబ్ల్యూపీఎల్.. ఐపీఎల్ లో పురుషుల ప్రారంభ వేలాన్ని బద్దలుకొట్టింది. బిడ్ లో మేము (బీసీసీఐ) మొత్తంగా రూ. 4669.99 కోట్లను పొందాం. విజేతలకు అభినందనలు. ఇది మహిళా క్రికెట్ లో విప్లవానికి నాంది పలుకనుంది..’ అని ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

ఐదు జట్లు :

- అహ్మదాబాద్ 
- ముంబై 
- బెంగళూరు 
- లక్నో 
- ఢిల్లీ 

అహ్మదాబాద్ ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలో అత్యంత ధనవంతుడైన గౌతం అదానీ.. ఏకంగా రూ. 1,289 కోట్లు దక్కించుకున్నాడని తెలుస్తున్నది. వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్. దీంతో ఆయన భారత క్రికెట్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చినట్టే. వాస్తవానికి గతేడాది ఆయన పురుషుల ఐపీఎల్ టీమ్ వేలంలో పాల్గొని గుజరాత్ జట్టు కోసం చివరినిమిషం వరకూ యత్నించారు. కానీ ఆ ప్రయాత్నాలు సఫలం కాలేదు. 

Scroll to load tweet…

ఇక ముంబై టీమ్ ను రిలయన్స్ (ముంబై ఇండియన్స్ ) రూ. 912 కోట్లకు దక్కించుకోగా బెంగళూరు ను (ఆర్సీబీ) ఆర్సీబీతో పాటు డియాజియో సంయుక్తంగా రూ. 901 కోట్లకు దక్కించుకున్నాయని సమాచారం. లక్నోను కాప్రి గ్లోబల్ (వీళ్లు యూఏఈలో జరుగుతున్న ఐఎల్ టీ20లో టీమ్ ను దక్కించుకున్నారు) రూ. 757 కోట్లకు దక్కించుకోగా, ఢిల్లీ (జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ లు సంయుక్తంగా) రూ. 810 కోట్లతో దక్కించుకున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.