WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ మొదటి మ్యాచ్ లో దారుణంగా ఓడిన గుజరాత్ జెయింట్స్ రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. తడబడుతూ సాగినా ఆ జట్టు బౌలర్లు పోరాడే స్కోరును యూపీ ముందు నిలిపింది.
తొలి మ్యాచ్ లో ముంబై చేతిలో ఓటమి నుంచి గుజరాత్ పాఠాలు నేర్చుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46, 7 ఫోర్లు), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. యూపీ బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. ఆంధ్రా అమ్మాయి సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24, 5 ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. మరో ఓపెనర్ సోఫీ డంక్లీ (13) రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించింది. అంజలి సర్వని వేసిన రెండో ఓవర్లో ఈ ఇద్దరూ తలా రెండు బౌండరీలు బాదారు. కానీ ఈ ఇద్దరూ వెంటవెంటనే పెవిలియన్ చేరారు.
గుజరాత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఐదో బంతికి డంక్లీని దీప్తి శర్మ ఔట్ చేయగా .. తర్వాతి ఓవర్లో ఎక్లిస్టోన్.. మేఘనను పెవిలియన్ కు పంపింది. నాలుగో స్థానంలో వచ్చిన అన్నాబెల్ సదర్లాండ్ (8) నూ ఎక్లిస్టోన్.. 8వ ఓవర్ తొలి బంతికి ఔట్ చేసింది. సుష్మా వర్మ (9)ను మెక్‌గ్రాత్ పెవిలియన్ కు పంపింది. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు.. 78-4గా ఉంది.
ఆదుకున్న హర్లీన్- గార్డ్‌నర్
నాలుగు వికెట్లు కోల్పోయిన గుజరాత్ ను ఆసీస్ ఆల్ రౌండర్ గార్డ్‌నర్ (19 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి హర్లీన్ డియోల్ ఆదుకుంది. ఈ ఇద్దరూ కాస్త నెమ్మదిగా ఆడినా రన్ రేట్ పడిపోకుండా చూసుకున్నారు. ఎక్లిస్టోన్ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతికి భారీ సిక్సర్ బాదిన గార్డ్‌నర్.. గుజరాత్ స్కోరును వంద పరుగులు దాటించింది. 15 ఓవర్లు ముగిసేటప్పటికీ గుజరాత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు.
బ్రేక్ ఇచ్చిన దీప్తి..
నెమ్మదిగా ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్న గార్డ్‌నర్ - హర్లీన్ డియోల్ ల జంటను దీప్తి శర్మ విడదీసింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 44 పరుగులు జోడించారు. అయితే దీప్తి వేసిన 16వ ఓవర్ రెండో బంతికి గార్డ్‌నర్ ను వికెట్ కీపర్ హీలి స్టంపౌట్ చేసింది. ఆమె స్థానంలో వచ్చిన హేమలతతో కలిసి హర్లీన్ దూకుడు పెంచింది. దేవికా వైద్య వేసిన 17వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టింది. కానీ అంజలి వేసిన 18వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద మెక్‌గ్రాత్ కు క్యాచ్ ఇచ్చింది.
చివరి ఓవర్లలో..
హర్లీన్ నిష్క్రమించిన తర్వాత ఆమె బాధ్యతలను హేమలత తీసుకుంది. దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్లో 6, 4 బాదిన ఆమె.. ఎక్లిస్టోన్ వేసిన చివరి ఓవర్లో 9 పరుగులు రాబట్టింది. ఫలితంగా 20 ఓవర్లలో గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో దీప్తి, ఎక్లిస్టోన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
