WPL 2023: ప్లేఆఫ్స్ రేసులో  కీలక మ్యాచ్  ఆడిన యూపీ వారియర్స్.. తొలుత బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో రాణించింది. గుజరాత్ జెయింట్స్ ను ఓడించి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో యూపీ వారియర్స్.. కష్టపడి గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్య ఛేదనలో 39 కే 3 వికెట్లు కోల్పోయినా తహిలా మెక్‌గ్రాత్ (38 బంతుల్లో 57, 11 ఫోర్లు), గ్రేస్ హరీస్ (41 బంతుల్లో 72, 7 ఫోర్లు, 4సిక్సర్లు) లు మెరుపులు మెరిపించడంతో పాటు చివర్లో ఎకిల్‌స్టోన్ రాణించడంతో ఆ జట్టు 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయంతో యూపీ ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఇక గుజరాత్, ఆర్సీబీలు బ్యాగ్ సర్దుకోవడమే.

భారీ లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ ఒడిదొడుకుల నడుమే మొదలైంది. మోనికా పటేల్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన హేలీ (12).. అదే ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడి హర్లీన్ డియోల్ కు క్యాచ్ ఇచ్చింది. కిమ్ గార్త్ వేసిన మూడో ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన నవ్‌గిరె (4) అదే ఓవర్లో నాలుగో బంతికి ఔటైంది. ఐదో ఓవర్లో దేవికా వైద్య (7) ను తనూజా కన్వర్ ఔట్ చేసింది.

మెక్‌గ్రాత్-హరీస్ అదరహో.. 

39 కే 3 వికెట్లు కోల్పోయిన యూపీని తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హరీస్ లు ఆదుకున్నారు. ఆది నుంచి గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో దంచికొట్టారు. కన్వర్ వేసిన ఐదో ఓవర్లో రెండు బౌండరీలు బాదిన మెక్‌గ్రాత్.. స్నేహ్ రాణా వేసిన ఆరో ఓవర్లో మూడు ఫోర్లు బాదింది. మోనికా పటేల్ వేసిన 8వ ఓవర్లో హరీస్ కూడా రెండు బౌండరీలు కొట్టింది. స్నేహ్ రాణా 9వ ఓవర్లో మెక్‌గ్రాత్ అదే సీన్ రిపీట్ చేసింది. పది ఓవర్లు ముగిసేసరికి యూపీ.. 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. 

హర్లీన్ డియోల్ వేసిన 12వ ఓవర్లో గ్రేస్ హరీస్ వీరబాదుడు బాదింది. రెండు సిక్సర్లు ఓ ఫోర్ తో 17 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత తనూజా బౌలింగ్ లో మెక్‌గ్రాత్ రెండు బౌండరీలు కొట్టింది. ధాటిగా సాగుతున్న వీరి జోరుకు ఆష్లే గార్డ్‌నర్ అడ్డుకట్ట వేసింది. ఆమె వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడిన మెక్‌గ్రాత్.. బౌండరీ లైన్ వద్ద ఉన్న స్నేహ్ రాణా చేతికి చిక్కింది. మెక్‌గ్రాత్, హరీస్ లు నాలుగో వికెట్ కు 53 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 

మెక్‌గ్రాత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (6) ఎక్కువ సేపు నిలువలేకపోయింది. స్నేహ్ రాణా వేసిన 15వ ఓవర్లో దీప్తి.. గార్డ్‌నర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దీప్తి నిష్క్రమించినా తర్వాత వచ్చిన ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్, 2 ఫోర్లు) తో కలిసి హరీస్ మిగతా పనిని పూర్తి చేసింది. తనూజా కన్వర్ వేసిన 17వ ఓవర్లో హరీస్ .. రెండు ఫోర్లు కొట్టింది. అయితే గార్డ్‌నర్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి హరీస్ ఇచ్చిన క్యాచ్ ను స్నేహ్ రాణా మిస్ చేసింది. ఆ తర్వాత బంతికే హరీస్ భారీ సిక్సర్ బాదింది. కిమ్ గార్త్ వేసిన 19వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ బౌండరీ కొట్టగా అదే ఓవర్లో హరీస్ భారీ సిక్సర్ బాదింది. కానీ ఐదో బంతికి ఆమె ఔటైంది. 

చివర్లో ఉత్కంఠ.. 

చివరి ఓవర్లో ఏడు పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి ఎకిల్‌స్టోన్ రెండు పరుగులు తీసింది. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి సిమ్రాన్ షేక్ (1) సింగిల్ తీసింది. నాలుగో బంతికి ఎకిల్‌స్టోన్.. ఎకిల్‌స్టోన్ రెండో పరుగును తీసే క్రమంలో సిమ్రాన్ రనౌట్ అయింది. కానీ ఐదో బంతికి ఎకిల్‌స్టోన్.. బౌండరీ కొట్టి యూపీని ప్లేఆఫ్స్ కు చేర్చింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆ జట్టులో హేమలత (57), ఆష్లే గార్డ్‌నర్ (60) లు రాణించారు.