WPL 2023: ఆర్సీబీ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరుకు తొలి మ్యాచ్ లోనే పరాజయం ఎదురైంది. ఢిల్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శన ధాటికి ఆర్సీబీ విలవిల్లాడింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్రయాణాన్ని సూపర్ డూపర్ విక్టరీతో మొదలుపెట్టింది. ఆదివారం ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు.. 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేయగా లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. జట్టు నిండా ఆల్ రౌండర్లు, స్టార్ బ్యాటర్లు ఉండటంతో ఆర్సీబీ మీద భారీ ఆశలు పెట్టుకున్న ఆ ఫ్రాంచైజీ అభిమానలకు నిరాశ తప్పలేదు. మరోవైపు ఢిల్లీ మాత్రం అంచనాలకు మించి రాణించి తొలి బోణీని ఘనంగా చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్ నోరిస్.. నాలుగు ఓవర్లు విసిరి 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మంధాన (23 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డెవైన్ (14) శుభారంభమే అందించారు. ఇద్దరూ కలిసి నాలుగు ఓవర్లకే ఆర్సీబీ స్కోరును 40 పరుగులు దాటించారు. మరిజన్నె కాప్ వేసిన రెండో ఓవర్లో మంధాన.. 4, 6, 4 బాదింది. ఆ తర్వాత శిఖా పాండే ఓవర్లో డెవైన్ కూడా మూడు ఫోర్లు కొట్టింది.
పతనం సాగిందిలా..
ఓపెనర్లిద్దరూ జోరు చూపిస్తుండటంతో మెగ్ లానింగ్ స్పిన్నర్ క్యాప్సీకి బంతినిచ్చింది. క్యాప్సీ.. ఢిల్లీకి డబుల్ బ్రేక్ ఇచ్చింది. ఆమె వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి డెవైన్.. షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. తన తర్వాతి ఓవర్లో ఆమె.. మంధానను కూడా ఔట్ చేసింది. రాధా యాదవ్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ఎల్లీస్ పెర్రీ (19 బంతుల్లో 31, 5 ఫోర్లు) ను నోరిస్ బోల్తా కొట్టించింది.
నోరిస్ వేసిన 11వ ఓవర్లో పెర్రీ క్లీన్ బౌల్డ్ అయింది. అదే ఓవర్లో దిశా కసత్ (9) కూడా ఔట్ అయింది. నోరిస్ తన తర్వాతి ఓవర్లో ప్రమాదకర రిచా ఘోష్ (2) ను ఔట్ చేసింది. మరుసటి బంతికే కనికా అహుజా (0) డకౌట్ అయింది. శిఖా పాండే వేసిన 14వ ఓవర్లో ఆశా శోభన (2) నిష్క్రమించింది.
చివర్లో నైట్..
96కే ఏడు వికెట్లు కోల్పోయి విజయం మీద ఆశలు కోల్పోయిన ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అది హీథర్ నైట్ మెరుపులే. నైట్.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసింది. నోరిస్ వేసిన 18వ ఓవర్లో ఆమె.. 4, 6 బాదింది. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి మెగ్ లానింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. నోరిస్ కు ఈ మ్యాచ్ లో ఇది ఐదో వికెట్ కావడం గమనార్హం. తద్వారా డబ్ల్యూపీఎల్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్ గా నోరిస్ నిలిచింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. తొలి ఓవర్ ను మినహాయిస్తే మిగతా 19 ఓవర్లలో బౌండరీల వర్షం కురిసింది. ఆ జట్టు ఓపెనర్లు షఫాలీ వర్మ (84), కెప్టెన్ మెగ్ లానింగ్ (72) లు తొలి వికెట్ కు 162 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన మరిజన్నె కాప్ (39 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (22 నాటౌట్) లు మెరుపులు మెరిపించారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది.
