WPL 2023:మహిళల ప్రీమియర్ లీగ్ లో  తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న గుజరాత్ జెయింట్స్.. అందుకు  అనుగుణంగానే అడుగులు వేస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్ పెట్టింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఓడిన గుజరాత్ జెయింట్స్.. నేడు ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి పత్తా చాటింది. సోఫియా డంక్లీ (28 బంతుల్లో 65, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు హర్లీన్ డియోల్ (45 బంతుల్లో 67, 9 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆసాంతం ఆర్సీబీ బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఫలితంగా ఆ జట్టు బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ సబ్బినేని మేఘన (8) మరోసారి నిరాశపరిచినా మరో ఓపెనర్ సోఫియా డంక్లీ మాత్రం రెచ్చిపోయి ఆడింది. పెర్రీ వేసిన రెండో ఓవర్ లో మూడో బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచింది. 

మేగన్ వేసిన మూడో ఓవర్లో డంక్లీ రెండు బౌండరీలు కొట్టింది.కానీ అదే ఓవర్లో మేఘన వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. రేణుకాసింగ్ వేసిన నాలుగో ఓవర్లో డంక్లీ.. 4,6,4 బాదింది. ఇక ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్లో అయితే 4,6,4,4,4 తో వీరవిహారం చేసింది. ఈ బాదుడుతో 18 బంతుల్లోనే ఆమె అర్థ సెంచరీ పూర్తయింది. డబ్ల్యూపీఎల్ లో ఇది రికార్డు. తొలి పవర్ ప్లేలో గుజరాత్.. వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.

మేఘన నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్.. డంక్లీ బాదుతుంటే ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన ఆమె.. ఐదో బంతికి ఫోర్ కొట్టింది. కానీ చివరి బంతికి భారీ షాట్ ఆడి హీథర్ నైట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. హర్లీన్ తో కలిసి ఆమె.. రెండో వికెట్ కు 60 పరుగులు జోడించింది. పది ఓవర్లలో గుజరాత్ స్కోరు 97-2గా ఉంది.

డంక్లీ నిష్క్రమణ తర్వాత గుజరాత్ స్కోరు రెండు ఓవర్ల పాటు కాస్త నెమ్మదించింది. కానీ ఆష్లే గార్డ్‌నర్ (15 బంతుల్లో 19, 2 ఫోర్లు), హర్లీన్ లు మధ్యలో నాలుగు ఓవర్ల పాటు పరుగులు చేయడంలో ఇబ్బందిపడ్డారు. పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న గార్డ్‌నర్ ను హీథర్ నైట్.. 14వ ఓవర్ ఐదో బంతికి బోల్తా కొట్టించింది. 

గార్డ్‌నర్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన హేమలత (7 బంతుల్లో 16, 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ఉన్నంతసేపూ ధాటిగానే ఆడింది. ప్రీతి బోస్ బౌలింగ్ లో 6,4,4 బాదిన ఆమె.. నైట్ వేసిన 16వ ఓవర్లో మూడో బంతికి రేణుకాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 

రెండు ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయినా డియోల్ ఏకాగ్రత కోల్పోలేదు. పెర్రీ వేసిన 17వ ఓవర్లో బౌండరీ కొట్టిన ఆమె.. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అదే ఓవర్లో మరో హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. సదర్లండ్ (14) ను రేణుకా 19వ ఓవర్లో తొలి బంతికి ఔట్ చేసింది. 18, 19 ఓవర్లలో గుజరాత్ కు 11 పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో 9 పరుగులొచ్చాయి. ఆర్సీబీ బౌలర్లలో నైట్, శ్రేయాంక్ పాటిల్ కు తలా రెండు వికెట్లు దక్కగా మేగన్, రేణుకా లకు తలో వికెట్ దక్కింది.