WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో నేడు రెండు క్రేజీ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మహిళల జట్లు నేడు ఢీకొంటున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్ లోనే గుజరాత్ జెయింట్స్ పై బంపర్ విక్టరీ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతున్నది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ కు రానుంది. ముంబై బౌలింగ్ కు రానుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో గుజరాత్ ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో గెలవాలని కోరుకుంటున్నది.
ఐపీఎల్ లో ఈ రెండు ఫ్రాంచైజీలకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అదే క్రేజ్ డబ్ల్యూపీఎల్ లో కూడా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ కు ఇదివరకే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం గమనార్హం.
కాగా తొలి మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు హీలి మాథ్యూస్, హర్మన్ ప్రీత్ కౌర్ , అమిలియా కెర్, నటాలి సీవర్ లు దుమ్ము దులిపారు. బౌలింగ్ లో ఇస్పీ వాంగ్, సీవర్, స్పిన్నర్ సైకా ఇషాక్ గుజరాత్ ను కోలుకోలేని దెబ్బతీశారు. ఇదే ప్రదర్శన ఆర్సీబీతో కూడా పునరావృతం చేయాలని ముంబై కోరుకుంటున్నది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆ జట్టును అడ్డుకోవడం బెంగళూరుకు కత్తిమీద సాము వంటిదే.
ఇక బెంగళూరు.. నిన్న ఢిల్లీతో మ్యాచ్ లో అన్ని రంగాల్లో విఫలమైంది. టీమిండియా స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తో పాటు ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ, మేగన్ లు భారీ పరుగులిచ్చారు. స్పిన్నర్ ఆశా శోభన కూడా ధారాళంగా పరుగులిచ్చింది. బ్యాటింగ్ లో కూడా స్మృతి మంధాన మినహఆ మిగతా వాళ్లు విఫలమయ్యారు. నేడు ముంబైతో జరిగే పోరులో మంధాన, డెవిన్, నైట్, పెర్రీలతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ విజృంభిస్తేనే ఆ జట్టుకు విజయం దక్కే అవకాశాలుంటాయి.
తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం ముంబై తమ టీమ్ లో మార్పులేమీ చేయకపోగా బెంగళూరు మాత్రం ఆశా శోభన స్థానంలో శ్రేయాంక పాటిల్ ను తుది జట్టులోకి తీసుకుంది.
ముంబై : యస్తికా భాటియా, హీలి మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నటాలి సీవర్, అమిలియా కెర్, అమన్‌జ్యోత్ కౌర్, పూజా వస్త్రకార్, హుమారియా కాజి, ఇస్సీ వాంగ్, జింతమని కలిత, సైకా ఇషాక్
బెంగళూరు : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డెవిన్, హీథర్ నైట్, దిశా కసత్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, ప్రీతి బోస్, మేగన్, రేణుకా సింగ్ ఠాకూర్
