ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు విఫలం.. ముంబై ముందు ఈజీ టార్గెట్..
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. ఆర్సీబీని భారీ స్కోరు చేయకుండా నిలువరించారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా ముంబైతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో అయినా విజయం సాధించి సీజన్ ను ముగించాలన్న ఆర్సీబీ.. ఆ ఆశలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయలేదు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో పాటు మిడిల్ ఓవర్స్ లో మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం చూస్తున్న ముంబై.. ఈ టార్గెట్ ను ఎంత త్వరగా ఛేదించగలిగితే ఆ జట్టుకు అంత బెటర్. మరి ముంబై ఏం చేసేనో..?
డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గత రెండు మ్యాచ్ లలో అద్భుత ఆరంభాలిచ్చిన సోఫీ డివైన్.. ఈ మ్యాచ్ లో డకౌట్ అయింది. సీవర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే ఆమె రనౌట్ గా వెనుదిరిగింది. అదే సీవర్ వేసిన ఐదో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టిన మంధాన (25 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్స్) ను అమెలియా కెర్ ఔట్ చేసింది.
మంధాన స్థానంలో వచ్చిన హెథర్ నైట్ (12) కూడా ఆకట్టుకోలేదు. అయితే వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీ (38 బంతుల్లో 29, 3 ఫోర్లు) మాత్రం ఫర్వాలేదనిపించింది. సైకా ఇషాక్ వేసిన పదో ఓవర్లో రెండు బౌండరీలు సాధించిన పెర్రీ.. తర్వాత బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసింది. ముంబై బైలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీకి పరుగుల రాకే కష్టమైంది. 15వ ఒవర్ వేసిన కెర్.. నాలుగో బంతికి కనిక అహుజా (12) ను బోల్తా కొట్టించింది. యస్తికా భాటియా ఆమెను స్టంపౌట్ చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు.. 4 వికెట్ల నష్టానికి 79 పరుగులే చేయగలిగింది.
చివర్లో..
స్కోరుబోర్డు మీద పరుగుల లేమితో ఉన్న ఆర్సీబీ ఇన్నింగ్స్ కు రిచా ఘోష్ (13 బంతుల్లో 29, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడేందుకు యత్నించిది. కనికా నిష్క్రమణ తర్వాత వచ్చిన ఆమె.. ఇస్సీ వాంగ్ వేసిన 16వ ఓవర్లో 4, 6 బాదింది. కానీ సీవర్ వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి పెర్రీ, నాలుగో బంతికి శ్రేయాంక పాటిల్ (4) లు ఔట్ అయ్యారు. ఇషాక్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతికి రిచా సిక్సర్ బాదిన ఐదో బంతికి మేగన్ (2) ఎల్బీగా వెనుదిరిగింది. కెర్ వేసిన 19వ ఓవర్లో రిచా రెండు ఫోర్లు కొట్టింది. వాంగ్ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన రిచా.. కెర్ కు క్యాచ్ ఇచ్చింది. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ కు మూడు వికెట్లు దక్కగా సీవర్, వాంగ్ కు రెండు, ఇషాక్ కు ఒక వికెట్ దక్కింది.