ముంబై గెలిచినా అగ్రస్థానం ఢిల్లీదే.. సీజన్‌ను ఓటమితో ముగించిన ఆర్సీబీ
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ ను ఓటమితో ముగించింది. ఫైనల్ స్థానాన్ని దక్కించుకునేందుకు గాను చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ముంబై.. రెండో స్థానానికే పరిమితమైంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమితో ముగించింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో వైఫల్యంతో పాటు బౌలింగ్ లో కూడా విఫలమై నిరాశపరిచింది. ఆర్సీబీ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 16.3 ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఈ మ్యాచ్ లో 11.1 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యాన్ని అందుకుని ఉంటే ముంబై.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీని అధిగమించి టాప్ ప్లేస్ ను దక్కించుకునేది. కానీ రెండు వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా ఆడిన ముంబై.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికే పరిమితమైంది. ఒకవేళ యూపీ వారియర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కాసేపట్లో జరుగబోయే మ్యాచ్ లో యూపీ.. ఢిల్లీని భారీ తేడాతో ఓడిస్తే అప్పుడు ముంబై మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరే అవకాశముంది.
ఇక 126 పరుగుల లక్ష్య ఛేదనను ముంబై ఆడుతూ పాడుతూ ఆరంభించింది. డివైన్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూస్ (17 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్సర్) 6, 4 కొట్టింది. ఇదే ఓవర్లో ఆరో బంతికి మాథ్యూస్.. వికెట్ కీపర్ రిచాకు క్యాచ్ ఇచ్చింది. కానీ అది నో బాల్ కావడంతో ఆమె బతికిపోయింది.
శ్రేయాంక పాటిల్ వేసిన నాలుగో ఓవర్లో యస్తికా భాటియా (26 బంతుల్లో 30, 6 ఫోర్లు) రెండు బౌండరీలు బాదింది. పెర్రీ వేసిన ఐదో ఓవర్లో యస్తికా మూడు బౌండరీలు సాధించింది. కానీ శ్రేయాంక వేసిన ఆరో ఓవర్లో యస్తికా.. స్మృతి మంధానకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ వెంటనే మేగన్ షుట్ వేసిన 8వ ఓవర్లో తొలి బంతికి మాథ్యూస్ కూడా మంధానకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఆశా శోభన వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన నటాలీ సీవర్ (13) నాలుగో బంతికి రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. పెర్రీ వేసిన పదో ఓవర్లో తొలి బంతికి హర్మన్‌ప్రీత్ (2) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ క్రమంలో అమెలియా కెర్ (27 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు), పూజా వస్త్రకార్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు) లు జాగ్రత్తగా ఆడారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 47 పరుగులు జోడించారు.
కానీ ముంబై విజయానికి సమీపంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. కనిక అహుజా వేసిన 16వ ఓవర్లో నాలుగో బంతికి పూజా ఔటైంది. తర్వాత బంతికే ఇస్సీ వాంగ్ కూడా పెవిలియన్ చేరింది. కానీ మంధాన వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన కెర్.. ముంబై విజయాన్ని ఖాయం చేసింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆ జట్టులో రిచా ఘోష్ (29), ఎలీస్ పెర్రీ (29) టాప్ స్కోరర్. స్మృతి మంధాన (24) ఫర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లలో సోఫీ డివైన్ డకౌట్ అవగా హెథర్ నైట్ (12), కనిక అహుజా (12), శ్రేయాంక పాటిల్ (4) లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ కు మూడు వికెట్లు దక్కగా సీవర్, వాంగ్ కు రెండు, ఇషాక్ కు ఒక వికెట్ దక్కింది.