WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ముంబై ఇండియన్స్ అప్రతీహాత విజయాలు కొనసాగుతున్నాయి.  ఈ సీజన్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఆ జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. 

మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రత్యర్థులు మారుతున్నా ఆ జట్టు ఫలితాల్లో మార్పు లేదు. ఈ సీజన్ లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేస్తూ ఫైనల్స్ కు మరింత దగ్గరైంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ తో ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో తడబడినా బౌలింగ్ లో మాత్రం దుమ్ముదులిపింది. ముంబై నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ముంబై.. 55 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది నాలుగో ఓటమి కాగా ముంబైపై రెండో పరాభవం.

ముంబై నిర్దేశించిన టార్గెట్ ను ఛేదించే క్రమంలో గుజరాత్ కు తొలి బంతికే షాక్ తాకింది. ఆ జట్టు ఓపెనర్ సోఫీ డంక్లీ ను సీవర్ తొలి బంతికే ఎల్బీ ద్వారా ఔట్ చేసింది. వన్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22, 3 ఫోర్లు), సబ్బినేని మేఘన (16) రెండో వికెట్ కు 33 పరుగులు జోడించారు.

వికెట్ల పతనం.. 

ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ కు పరుగల రాక కష్టమే అయింది. వాంగ్ వేసిన ఐదో ఓవర్లో హర్లీన్.. రెండు బౌండరీలు బాదింది. ఈ జంటను మాథ్యూస్ విడదీసింది. ఆమె వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి మేఘన.. అమెలియా కెర్ కు క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో సదర్లాండ్ (0) కూడా ఎల్బీగా వెనుదిరిగింది. 

ఇస్సీ వాంగ్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి హర్లీన్ కూడా వికెట్ల ముందు దొరికిపోయింది. ఆ మరుసటి ఓవర్లో తొలి బంతికి గార్డ్‌నర్ (8) ఇచ్చిన క్యాచ్ ను కవర్ పాయింట్ వద్ద జింతిమన కలిత సూపర్ క్యాచ్ అందుకోవడంతో ఆమె కూడా పెవిలియన్ బాట పట్టింది. పది ఓవర్లలో ఆ జట్టు స్కోరు 49 పరుగులే చేసింది. కెర్ వసిన 12వ ఓవర్లో హేమలత (6) భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్ లో ఉన్న వాంగ్ చేతికి చిక్కింది. సీవర్ వేసిన 15వ ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టిన కెప్టెన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20, 3 ఫోర్లు) ఐదో బంతికి ఎల్బీ రూపంలో ఔట్ అయింది.

సీవర్ వేసిన 17వ ఓవర్లో కిమ్ గార్త్ (8) కూడా కెప్టన్ కౌర్ కు క్యాచ్ ఇచ్చింది. మాథ్యూస్ వేసిన 18వ ఓవర్లో తనూజా కన్వర్ (0) వికెట్ కీపర్ యస్తికా చేతికి చిక్కింది. ముంబై బౌలర్లలో సీవర్, హేలి మాథ్యూస్ లకు తలా మూడు వికెట్లు దక్కాయి. వాంగ్ కు ??, మాథ్యూస్ కు ఒక వికెట్ దక్కింది. 

అంతకుముందు తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్.. 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసింది. యస్తికా భాటియా.. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 44 రన్స్ చేసింది. గుజరాత్ బౌలర్లలో గార్డ్‌నర్ కు మూడు వికెట్లు దక్కగా గార్త్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్ లు తలా ఓ వికెట్ తీశారు.