WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో సంచలన విజయంతో తొలి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ప్రపంచ క్రికెట్ ను కనుసైగతో శాసిస్తున్న బీసీసీఐ.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలోనూ సంచలనం సృష్టించింది. ఐపీఎల్ లో 2022 సీజన్ విన్నర్స్ గుజరాత్ టైటాన్స్ కు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ అందజేసిన బీసీసీఐ.. డబ్ల్యూపీఎల్ లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కు రూ. 6 కోట్లు అందించింది. పొరుగునే ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. తమ దేశంలో ఇటీవలే నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తో పోల్చితే ఇది రెట్టింపు అమౌంట్.
2023 సీజన్ లో లాహోర్ ఖలాండర్స్ విన్నర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందుకు గాను ఆ జట్టుకు రూ. 3.4 కోట్లు దక్కించుకుంది. కానీ ముంబై ఇండియన్స్.. డబ్ల్యూపీఎల్ గెలిచినందుకు ఇందుకు రెట్టింపు నగదు గెలుచుకుంది. ఈ లీగ్ లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ. 3 కోట్లు దక్కాయి.
పీఎస్ఎల్ తో పాటు పలు ఇతర లీగ్ లు, ఉమెన్స్ క్రికెట్ లీగ్స్ లలో కూడా ఇంత భారీ ప్రైజ్ మనీ ఇవ్వడంలో బీసీసీఐ రికార్డులు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూపీఎల్ తో పాటు మహిళల లీగ్ లు మరో రెండుచోట్ల జరుగుతున్నాయి. అందులో ఒకటి ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ లో నిర్వహించే ది హండ్రెడ్ (ఉమెన్స్). బిగ్ బాష్ లీగ్ లో విజేతలకు రూ. 2.7 కోట్లు దక్కుతుండగా.. ది హండ్రెడ్ లో టైటిల్ విన్నర్స్ కు రూ. 1.5 కోట్లు దక్కుతాయి.
ఇవే గాక పలు ఇతర లీగ్ లతో పోల్చితే కూడా ముంబై ఇండియన్స్ దక్కించుకున్న ప్రైజ్ మనీనే ఎక్కువ. ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ (ఎస్ఎ 20 లీగ్) లో ప్రైజ్ మనీ రూ. 15 కోట్లు ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ లో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ (రూ. 8 కోట్లు) మాత్రమే డబ్ల్యూపీఎల్ కంటే ముందున్నాయి. డబ్ల్యూపీఎల్ (రూ. 6 కోట్లు) తర్వాత ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ఐఎల్ టీ20) రూ. 5.7 కోట్లు, పాకిస్తాన్ సూపర్ లీగ్ రూ. 3.4 కోట్లు, బిగ్ బాష్ లీగ్ రూ. 2.7 కోట్లు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రూ. 2.7 కోట్లు, హండ్రెడ్ రూ. 1.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంది.
డబ్ల్యూపీఎల్ లో బెస్ట్ వీళ్లే..
- ఆరెంజ్ క్యాప్ : మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిట్సల్) - 345 రన్స్
- పర్పుల్ క్యాప్ : హేలీ మాథ్యూస్ (ముంబై ఇండియన్స్) - 16 వికెట్లు
- హయ్యస్ట్ స్కోర్ : సోఫీ డివైన్ (99 - ఆర్సీబీ)
- బెస్ట్ బౌలింగ్ : మరియనె కాప్ (ఢిల్లీ : 5-15)
- మోస్ట్ సిక్సెస్ : షెఫాలీ వర్మ (13)
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ : హేలీ మాథ్యూస్
- ఎమర్జింగ్ ప్లేయర్ : యస్తికా భాటియా
- క్యాచ్ ఆఫ్ ది సీజన్ : హర్లీన్ డియోల్ (గుజరాత్)
