WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కు చేరింది. ప్లేఆఫ్స్ లో యూపీ వారియర్స్ ను చిత్తుగా ఓడించి ఢిల్లీ క్యాపిట్సల్ తో తుది పోరుకు సిద్ధమైంది. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన ముంబై ముందు యూపీ తేలిపోయింది. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో అదరగొట్టింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో ఆది నుంచి నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ముంబై ఇండియన్స్ కీలకమైన ఎలిమినేటర్ (ప్లేఆఫ్స్) లో కూడా ఆల్ రౌండ్ షో తో దుమ్మురేపింది. యూపీ వారియర్స్‌ను జడివానలా ముంచెత్తి ఢిల్లీ పనిపట్టేందుకు ఫైనల్ కు వెళ్లింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ - ముంబై మధ్య ముగిసిన మ్యాచ్ ను హర్మన్‌ప్రీత్ సేన 72 పరుగుల తేడాతో గెలుచుకుంది. ముంబై నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ.. 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ తో యూపీ పనిపట్టింది. ఈ లీగ్ లో ఇదే తొలి హ్యాట్రిక్. ఢిల్లీ - ముంబై మధ్య ఫైనల్ ఆదివారం (మార్చి 26న) బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతుంది.
భారీ లక్ష్య ఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి యూపీ ఆది నుంచీ ఇబ్బందులు ఎదుర్కొంది. సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (1) ఎక్స్‌ట్రా కవర్స్ లో ఉన్న మాథ్యూస్ చేతికి చిక్కింది. మూడో ఓవర్ వేసిన వాంగ్.. యూపీ సారథి హేలీ (11)ని ఔట్ చేసింది.
వాంగ్ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి కిరణ్ నవ్‌గిరె (27 బంతుల్లో 43, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఫ్ సైడ్ డ్రైవ్ చేయగా క్విక్ సింగిల్ కోసం యత్నించిన తహిలా మెక్‌గ్రాత్ (7) పరుగు తీసే యత్నంలో రనౌట్ అయింది. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో నవ్‌గిరె యూపీని ఆదుకునే యత్నం చేసింది. ఇషాక్ వేసిన ఆరో ఓవర్లో 4, 4, 4, 6 తో ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది. అమెలియా కెర్ వేసిన ఏడో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడిన ఆమె మాథ్యూస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయింది. మరోవైపు మెక్‌గ్రాత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన గ్రేస్ హ్యారీస్ (12) మూడు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించినా సీవర్.. యూపీకి భారీ షాకిచ్చింది. సీవర్ వేసిన 8వ ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడిన హ్యారీస్.. లాంగాన్ వద్ద ఉన్న వాంగ్ చేతికి చిక్కింది. పది ఓవర్లకు యూపీ.. నాలుగు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.
వాంగ్ హ్యట్రిక్..
అమెలియా కెర్ వేసిన 12వ ఓవర్లో నవ్‌గిరె రెండు భారీ సిక్సర్లు బాదింది. కానీ ఆ తర్వాతి ఓవర్ వేసిన వాంగ్.. రెండో బంతికి నవ్‌గిరెను ఔట్ చేసింది. తర్వాతి బంతికే సిమ్రాన్ షేక్ బౌల్డ్ అయింది. నాలుగో బంతికి సోఫీ ఎకిల్‌స్టోన్ కూడా బౌల్డ్ అయింది. దీంతో వాంగ్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. డబ్ల్యూపీఎల్ లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం గమనార్హం. ఈ ఓవర్ కు ముందు 84-4 గా ఉన్న యూపీ.. ఆరు బంతుల తర్వాత 86-7 గా మారింది.
14వ ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్ లో రెండు బౌండరీలు కొట్టిన దీప్తి శర్మ (16) కూడా షార్ట్ ఫైన్ లెగ్ వద్ద జింతమణి కలిత సూపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరింది. కలిత వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి అంజలి శర్వణి (5) క్లీన్ బౌల్డ్ అయింది. సైకా ఇషాక్.. 18వ ఓవర్లో గైక్వాడ్ ను ఎల్బీగా వెనక్కి పంపి యూపీ ఇన్నింగ్స్ ను తెరదించింది.
ముంబై బౌలర్లలో వాంగ్ నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాక్ కు రెండు.. సీవర్, కలిత, మాథ్యూస్ లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. సీవర్ (72), కెర్ (29) రాణించారు.
