WPL 2023: ప్రత్యర్థులు మారుతు్నా ఆర్సీబీ తలరాత మారడం లేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇంతవరకూ విజయబోణీ కొట్టని ఆ జట్టు బుధవారం గుజరాత్ జెయింట్స్ తో పోరులో కూడా నిరాశపరిచింది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఆడిన మూడు మ్యాచ్ లలో పరాజయమే ఎదురైంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ది అదే కథ.. మ్యాచ్ ముగిశాక అభిమానులకు అదే వ్యథ.. ప్రత్యర్థులు మారుతున్నా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. జట్టు నిండా స్టార్ బ్యాటర్లు, అంతర్జాతీయ ఆల్ రౌండర్లు, హిట్టర్లు ఉన్నా అవసరానికి ఆ జట్టును ఆదుకునే వారే కరువయ్యారు. సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లు ఓడిన ఆ జట్టు బుధవారం గుజరాత్ తో జరిగిన మూడో మ్యాచ్ లో కూడా ఓడింది. గుజరాత్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా గుజరాత్.. 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. గుజరాత్ కు ఈ సీజన్ లో ఇది తొలి విజయం కాగా ఆర్సీబీకి మూడో పరాజయం.
గుజారత్ తో పోరులో తొలుత బౌలర్లు విఫలం కాగా తర్వాత బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో విజృంభించలేకపోయారు. మిడిల్ ఓవర్స్ లో గుజరాత్ బౌలర్లు ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయడంతో మంధాన అండ్ కో. కు ఓటమి తప్పలేదు. ఆర్సీబీలో ఓపెనర్ సోఫియా డివైన్ (45 బంతుల్లో 66, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించింది. చివర్లో నైట్ (11 బంతుల్లో 30, 5 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయాంక పాటిల్ (4 బంతుల్లో 11, 1 ఫోర్, 1 సిక్సర్) ల మెరుపులు ఆ జట్టుకు విజయాన్నిఅందించలేకపోయాయి.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి ఆశించిన ఆరంభమే దక్కింది. తనూజా కన్వర్ వేసిన రెండో ఓవర్లోనే మంధాన బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు సాధించింది. కిమ్ గార్త్ వేసిన మూడో ఓవర్లో డివైన్ రెండు, స్మృతి మంధాన (14 బంతుల్లో 18, 3 ఫోర్లు) ఒక ఫోర్ కొట్టారు.
సదర్లండ్ వేసిన ఐదో ఓవర్లో డివైన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. ఐదు ఓవర్లలోనే ఈ జోడీ 54 పరుగులు జోడించింది. కానీ ఆర్సీబీకి గార్డ్‌నర్ తొలి షాక్ ఇచ్చింది. ఆమె వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి స్మృతి మంధాన.. మాన్సి జోషికి క్యాచ్ ఇచ్చింది.
మరీ నెమ్మదిగా..
మంధాన నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఎలీస్ పెర్రీ.. తొలి బంతికే బౌండరీతో ఖాతా తెరిచింది. కానీ పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ స్కోరు నెమ్మదించింది. ఆరో ఓవర్లో ఐదు పరుగులే రాగా ఏడో ఓవర్లో 3, ఎనిమిదో ఓవర్లో 4, 9వ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. పదో ఓవర్లో కూడా 8 పరుగులే వచ్చాయి. తొలి ఐదు ఓవర్లలో 54 పరుగులు రాగా తర్వాతి ఐదు ఓవర్లలో 28 పరుగులే వచ్చాయి. దీంతో ఛేదించాల్సి రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. పది ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు.. 82-1గా ఉంది.
తొలుత భారీగా పరుగులిచ్చుకున్న గుజరాత్ బౌలర్లు తర్వాత కట్టడి చేయడంతో బెంగళూరుకు పరుగుల రాకే కష్టమైంది. కానీ రన్ రేట్ పెరిగిపోతుండటంతో పెర్రీ రూట్ మార్చింది. మాన్సీ జోషి వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి హేమలతకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. ఇక పవర్ ప్లే లో రెచ్చిపోయి ఆడిన డివైన్.. 13 వ ఓవర్లో రెండు ఫోర్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
ఒత్తిడిలో క్యూ..
రన్ రేట్ పెరుగుతుండటంతో పెర్రీ స్థానంలో వచ్చిన రిచా ఘోష్ బ్యాట్ కు పనిచెప్పింది. స్నేహ్ రాణా వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. తనూజా వేసిన 15వ ఓవర్ లో తొలి బంతికే భారీ సిక్సర్ బాదింది డివైన్. 15 ఓవర్లకు బెంగళూరు 125-2 గా ఉంది. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 77 పరుగులు చేయాల్సి ఉంది. 16వ ఓవర్ వేసిన గార్డ్‌నర్..తొలి బంతికే రిచాను క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే డివైన్ కూడా సదర్లండ్ బౌలింగ్ లో గార్డ్‌నర్ సూపర్ క్యాచ్ తో వెనుదిరిగింది.
నైట్, కనికల పోరాటం..
డివైన్ నిష్క్రమణ తర్వాత వచ్చిన హీథర్ నైట్, కనిక అహుజాలు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సదర్లండ్ వేసిన 17వ ఓవర్లో నైట్.. మూడు ఫోర్లు బాదింది. ఈ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. స్నేహ్ రాణా వేసిన 18వ ఓవర్లో కనిక రెండు బౌండరీలు కొట్టింది. ఇక చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు కావాల్సి ఉండగా కనికను గార్డ్‌నర్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఇదే ఓవర్లో నైట్.. చివరి బంతికి సిక్సర్ బాదింది. చివరి ఓవర్లో ఆర్సీబీ కి 24 పరుగులు కావాలి.
సదర్లండ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి పూనమ్ ఖేమ్నర్ (2) ఔట్ అయింది. రెండో బంతికి శ్రేయాంక పాటిల్ సింగిల్ తీసింది. మూడో బంతికి నైట్ కూడా సింగిలే తీయడంతో గుజరాత్ విజయం ఖాయమైంది. తర్వాతి రెండు బంతుల్లో శ్రేయాంక 6, 4, బాదినా అవి ఓటమి అంతరాన్ని తగ్గించాయే గానీ విజయాన్ని అందించలేదు. ఫలితంగా గుజరాత్.. 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ (65), హర్లీన్ డియోల్ (67) లు అర్థ సెంచరీలతో రాణించారు.
