ఢిల్లీకి షాకిచ్చిన గుజరాత్.. ప్లేఆఫ్ ఆశలు సజీవం.. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో క్యాపిటల్స్‌కు పరాభవం
WPL 2023: ప్లేఆఫ్స్ దిశగా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ జెయింట్స్ ఊహించని షాకిచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీని గుజరాత్ ఓడించి తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ ముంగిట నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు గుజరాత్ జెయింట్స్ ఊహించని షాకిచ్చింది. బ్యాటింగ్ లో విఫలమైనా గుజరాత్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఢిల్లీ పనిపట్టారు. తమను ఓడించిన టీమ్ పై గుజరాత్ కసిగా బదులు తీర్చుకోవడమే గాక ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 148 పరగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్.. 18.4 ఓవర్లలో 136 పరుగుల వద్దే పరిమితమైంది. దీంతో గుజరాత్.. 11 పరగుల తేడాతో విజయం సాధించింది.
మోస్తారు లక్ష్య ఛేదనలో ఢిల్లీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లను ఉతికారేసిన షఫాలీ వర్మ (8) ఈసారి విఫలమైంది. తనూజా కన్వర్ వేసిన రెండో ఓవర్లో చివరి బంతికి షఫాలీ క్లీన్ బౌల్డ్ అయింది. వన్ డౌన్ లో వచ్చిన అలీస్ క్యాప్సీ (11 బంతుల్లో 22, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నది కాసేపేఅయినా మెరుపులు మెరిపించింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ (18) తో కలిసి క్యాప్సీ రెండో వికెట్ కు 38 పరుగులు జోడించింది. ఆరో ఓవర్లో లానింగ్ ను స్నేహ్ రాణా ఎల్బీగా వెనక్కి పంపింది. అదే ఓవర్లో ఐదో బంతికి డంక్లీ వేసిన అద్భుత త్రో తో క్యాప్సీ రనౌట్ అయింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. క్యాప్సీ నిష్క్రమించిన కొద్దిసేపటికే జెమీమా (1) ను కిమ్ గార్త్ ఔట్ చేసింది.
హర్లీన్ డియోల్ వేసిన 11వ ఓవర్లో జెస్ జొనాసేన్ (4) కూడా నిష్క్రమించింది. కానీ మరిజనె కాప్ (36) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. మాన్సి జోషి వేసిన 9వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కాప్.. హర్లీన్ వేసిన 13వ ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదింది. కానీ ఆ వెంటనే గార్డ్‌నర్ వేసిన 14వ ఓవర్లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్లో రెండో బంతికి తాన్యా భాటియా (1) క్లీన్ బౌల్డ్ అవగా నాలుగో బంతికి స్నేహ్ రాణా వేసిన త్రో తో మరిజనె కాప్ (36) రనౌట్ అయింది. దీంతో ఢిల్లీ విజయం మీద ఆశలు వదులుకుంది. ఇక తనూజా వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి రాధా యాదవ్ (1) కూడా వికెట్ కీపర్ సుష్మాకు క్యాచ్ ఇచ్చింది.
ఆశలు రేపిన అరుంధతి..
స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టినా ఆంధ్రా అమ్మాయి అరుంధతి రెడ్డి ఢిల్లీని ఆదుకుంది. తనూజా వేసిన 15వ ఓవర్లో చివరి బంతికి బౌండరీ బాదిన ఆమె.. హర్లీన్ బౌలింగ్ లో కూడా ఓ ఫోర్ కొట్టింది. తర్వాత స్నేహ్ రాణా, కిమ్ గార్త్ ల బౌలింగ్ లో కూడా బౌండరీలు సాధించి లక్ష్యాన్ని కరిగించింది. ఢిల్లీని విజయానికి దగ్గరగా చేసిన ఆమె.. ఆ జట్టు 14 పరుగులు చేయాల్సి ఉండగా కిమ్ గార్త్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి స్నేహ్ రాణాకు క్యాచ్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. గార్డ్‌నర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి పూనమ్ యాదవ్ ఔటవడంతో గుజరాత్ విజయం ఖాయమైంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (57), గార్డ్‌నర్ (51), హర్లీన్ డియోల్ (31) రాణించారు.