WPL 2023: ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు దుమ్ము దులిపారు. వన్ డౌన్ బ్యాటర్ నటాలీ సీవర్ వీర విజృంభణతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ చేరాలంటే తప్పకుండా ఆడాల్సిన మ్యాచ్ లో ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. గత మూడు మ్యాచ్ లలో విఫలైమన బ్యాటర్లంతా నేటి మ్యాచ్ లో ధాటిగా ఆడారు. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు శుభారంభం అందించగా.. వన్ డౌన్ లో వచ్చిన నటాలీ సీవర్ (38 బంతుల్లో 72 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (19 బంతుల్లో 29, 5 ఫోర్లు) లు వీరబాదుడు బాదారు. వీరి దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై.. 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో రాణించిన ముంబైకి బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు యస్తికా భాటియా (18 బంతుల్లో 21, 4 ఫోర్లు), హేలీ మాథ్యూస్ (26 బంతుల్లో 26, 2 ఫోర్లు, ఒక సిక్సర్) లు 31 పరుగులు జోడించారు. ముంబై ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించిన యస్తికా.. గైక్వాడ్ వేసిన మూడో ఓవర్లో కూడా రెండు బంతులను బౌండరీకి తరలించింది.
గ్రేస్ హరీస్ వేసిన నాలుగో ఓవర్లో మాథ్యూస్ భారీ సిక్సర్ కొట్టింది. కానీ అంజలి వేసిన ఐదో ఓవర్లో రెండోబంతికి.. యస్తికా భారీ షాట్ ఆడబోయి కిరణ్ నవ్‌గిరె కు క్యాచ్ ఇచ్చింది. యస్తికా నిష్క్రమించిన తర్వాత క్రీజులోకివచ్చిన నటాలీ సీవర్ తో కలిసి మాథ్యూస్ రెండో వికెట్ కు 38 పరుగులు జోడించింది. ఇద్దరూ కలిసి యూపీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. అయితే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తర్వాత వేసిన 9వ ఓవర్లో మొదటి బంతికే పర్శవి చోప్రా.. మాథ్యూస్ ను ఔట్ చేసింది. పది ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.
మాథ్యూస్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (15 బంతుల్లో 14, 1ఫోర్) తో కలిసి సీవర్ ముంబై ఇన్నింగ్స్ ను నడిపించింది. పర్శవి వేసిన 12వ ఓవర్లో సీవర్.. 4,6,4 బాదింది. అయితే ఎకిల్‌స్టోన్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన కౌర్.. ఐదో బంతికి ఔట్ అయింది.
15 ఓవర్ల తర్వాత బాదుడే..
ముంబై ఇన్నింగ్స్ లో 15వ ఓవర్ వరకూ ఒక ఎత్తు అయితే చివరి ఔదు ఓవర్లు మరో ఎత్తు. అప్పటివరకు ముంబై.. 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లో కెర్, సీవర్ తలా ఓ బౌండరీ కొట్టారు. సీవర్.. ఎక్స్‌ట్రా కవర్ దిశగా బౌండరీ బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. గైక్వాడ్ వేసిన 17వ ఓవర్లో ఆమె రెండు బౌండరీలు బాదింది. ఎకిల్‌స్టోన్ వేసిన 19వ ఓవర్లో అమెలియా.. మూడు బౌండరీలు సాధించింది. కానీ అదే ఓవర్లో చివరి బంతికి నిష్క్రమించింది. ఇక చివరి ఓవర్ లో పూజా వస్త్రకార్ ( 4 బంతుల్లో 11 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్సర్) ఓ ఫోర్, సిక్సర్ బాది ముంబై స్కోరును 180 దాటించింది.
