ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ.. హర్మన్‌సేనకు వరుసగా రెండో ఓటమి..
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు డబుల్ స్ట్రోక్ తాకింది. టేబుల్ టాపర్స్ గా ఉన్న ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ముంబైని ఢిల్లీ కిల్లీ నమిలినంత ఈజీగా ఓడించింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత తడబడుతోంది. మూడు రోజుల క్రితం యూపీతో మ్యాచ్ లో ఓడిన ఆ జట్టు.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై - ఢిల్లీ నడుమ జరిగిన మ్యాచ్ లో హర్మన్ సేనకు రెండోసారి ఓటమిని రుచి చూపించింది. తొలుత ఢిల్లీ బౌలర్ల ధాటికి ముంబై.. 109 పరుగులకే పరిమితమవగా తర్వాత లక్ష్యాన్ని ఢిల్లీ.. కిల్లీ నమిలినంత ఈజీగా ఉదిపారేసింది. 9 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఈజీ విక్టరీ కొట్టింది.
స్వల్ప లక్ష్య ఛేదనను ఢిల్లీ ధాటిగా ఆరంభించింది. ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ (15 బంతులలో 33, 6 ఫోర్లు, 1 సిక్స్), మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) లు వీరబాదుడు బాదారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 4.3 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. సీవర్ వేసిన తొలి ఓవర్లో లానింగ్ రెండు ఫోర్లు కొట్టింది. వాంగ్ వేసిన రెండో ఓవర్లో షఫాలీ మూడు బౌండరీలు బాదింది.
సైకా ఇషాక్ వేసిన నాలుగో ఓవర్లో లానింగ్ ఓ ఫోర్ కొట్టగా షఫాలీ రెండు బౌండరీలు సాధించింది. మాథ్యూస్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి షఫాలీ సిక్సర్ కొట్టినా తర్వాత బంతికే స్టంపౌట్ అయింది. ఆరు ఓవర్లలోనే ఢిల్లీ.. సగం లక్ష్యాన్ని దాటేసింది.
షఫాలీ నిష్క్రమించినా ఆమె స్థానంలో వచ్చిన అలీస్ క్యాప్సీ (17 బంతుల్లో 38, 1 ఫోర్, 5 సిక్సర్లు) తన బాదుడుతో లక్ష్యాన్ని మరింత చిన్నది చేసింది. మాథ్యూస్ వేసిన ఏడో ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదింది. ఆ ఓవర్లో బైస్ రూపంలో ఓ బౌండరీ కూడా వచ్చింది. మొత్తంగా ఆ ఓవర్లో ఢిల్లీకి 22 పరుగులొచ్చాయి. ఇదే ఊపులో క్యాప్సీ.. ఇషాక్ వేసిన 9వ ఓవర్లో 6, 4, 6 బాది ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో స్టార్ బ్యాటర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, సీవర్, అమెలియా కెర్ లు దారుణంగా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ (23), పూజా వస్త్రకార్ (26), ఇస్సీ వాంగ్ (23) లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కాప్, శిఖా పాండే, జెస్సీ జొనాసేసన్ లు తలా రెండు వికెట్లు తీయగా అరుంధతి రెడ్డి ఒక వికెట్ పడగొట్టింది.