WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ - యూపీ వారియర్స్ మ్యాచ్ కు మధ్యలో కొంతసేపు వర్షం అడ్డంకిగా మారింది. కానీ అంతకంటే ముందే స్టేడియంలో ఢిల్లీ సారథి లానింగ్ మెరుపులు మెరిపించింది.
అదే దూకుడు.. అదే బాదుడు.. ప్రత్యర్థి మారినా తమ బాదుడులో మార్పేమీ లేదన్నట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపోయింది. ముంబై లోని డీవై పాటిల్ వేదికగా యూపీ వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో కూడా ఢిల్లీ 223 స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి వీరబాదుడు బాదగా జొనాసేన్ (20 బంతుల్లో 42 , 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 34, 4 ఫోర్లు) లు కూడా తలో చేయి వేశారు. ఫలితంగా ఆ జట్టు యూపీ ఎదుట భారీ లక్ష్యాన్ని నిలిపింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కు గత మ్యాచ్ లో మాదిరిగానే అదిరిపోయే ఆరంభం దక్కింది. షఫాలీ వర్మ (14 బంతుల్లో 17, 1 సిక్సర్, 1 ఫోర్) కు తోడుగా మెగ్ లానింగ్ రెచ్చిపోయింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు.
బౌండరీతో ఖాతా తెరిచిన లానింగ్.. ఇస్మాయిల్ వేసిన రెండో ఓవర్లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదింది. అంజలి వేసిన మూడో ఓవర్లో షఫాలీ కూడా సిక్సర్ కొట్టింది. ఇస్మాయిల్ వేసిన ఐదో ఓవర్లో లానింగ్ 6,4,4 తో రెచ్చిపోయింది. ఇక గైక్వాడ్ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతికి షఫాలీ బౌండరీ కొట్టి లానింగ్ కు స్ట్రైక్ ఇవ్వగా ఆమె మూడు బౌండరీలు బాదింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లో మెక్‌గ్రాత్.. ఏడో ఓవర్లో మూడో బంతికి షఫాలీని ఔట్ చేసింది. మెక్‌గ్రాత్ వేసిన బంతిని షఫాలీ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడగా కిరణ్ నవ్‌గిరె అద్భుత క్యాచ్ అందుకుంది.
ఎక్లిస్టోన్ వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి భారీ సిక్సర్ బాదిన లానింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇది ఆమెకు వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఓవర్ ముగిసిన తర్వాత ఆటకు కొంతసేపు వర్షం అంతరాయం కలిగించింది.
15 నిమిషాల విరామం అనంతరం మళ్లీ మొదలైన ఆటలో ఎక్లిస్టోన్ వేసిన 11వ ఓవర్లో రెండో బంతికి మరిజనె కాప్ (16) దీప్తిశర్మకు క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో లానింగ్ రెండు ఫోర్లు కొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన 12వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన లానింగ్.. మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. 12 ఓవర్లు ముగిసేటప్పటికీ ఢిల్లీ స్కోరు 120 పరుగులకు చేరింది.
లానింగ్ స్థానంలో వచ్చిన అలీస్ క్యాప్సీ (10 బంతుల్లో 21, 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి ఆమె మూడో వికెట్ కు 32 పరుగులు జోడించింది. ఎదుర్కున్న మూడో బంతికే సిక్సర్ బాదిన క్యాప్సీ.. మెక్‌గ్రాత్ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. కానీ ఇస్మాయిల్ వేసిన 15వ ఓవర్ రెండో బంతికి ఎక్లిస్టోన్ చేతికి చిక్కింది.
క్యాప్సీ నిష్క్రమించిన తర్వాత వచ్చిన జొనాసేన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. అంజలి బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదిన ఆమె మెక్‌గ్రాత్ వేసిన 19వ ఓవర్లో 6,4 కొట్టింది. ఇదే ఓవర్లో జెమీమీ కూడా రెండు బౌండరీలు బాదింది. మొత్తంగా ఈ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. ఇక చివరి ఓవర్లో రెండో బంతికి జొనాసేన్ భారీ సిక్సర్ బాదడం ద్వారా ఢిల్లీ స్కోరు 200 దాటింది. జెమీమాతో కలిసి జొనాసేన్ నాలుగో వికెట్ కు 34 బంతుల్లోనే 67 పరుగులు జోడించింది.
