Asianet News TeluguAsianet News Telugu

ముంబైని ముంచిన ఢిల్లీ బౌలర్లు.. టేబుల్ టాపర్స్ కు డబుల్ స్ట్రోక్ తప్పదా..?

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టేబుల్ టాపర్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా రెండో  మ్యాచ్ లోనూ ఓటమి ముంగిట నిలిచింది. బ్యాటర్ల వైఫల్యంతో ముంబై..  ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు ఈజీ టార్గెట్ పెట్టింది. 

WPL 2023: Delhi Capitals Restrict Mumbai Indians at 109 MSV
Author
First Published Mar 20, 2023, 8:57 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  తొలి దశలో అదరగొట్టి  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై  ఇండియన్స్..  ముగింపు దశకు వచ్చేసరికి తడబడుతోంది. మూడు రోజుల క్రితం యూపీతో మ్యాచ్ లో ఓడిన ముంబై.. ఇంకా  ఆ ఓటమి తాలుకూ బాధ నుంచి కోలుకోనట్టుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా  అదే పేలవ ఆటతో   మరో ఓటమి అంచున నిలిచింది.  ఢిల్లీ క్యాపిటల్స్ తో  డీవై పాటిల్  వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో  నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయిన ముంబై ఆ తర్వాత కోలుకోలేదు.  ఢిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టు మీద ఒత్తిడి పెంచారు. 

టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైకి వరుస షాకులిచ్చింది.   మెగ్ లానింగ్ నిర్ణయం తప్పుకాదని నిరూపిస్తూ   ఢిల్లీ బౌలర్లు రెచ్చిపోయారు.  మూడో ఓవర్ లోనే  ముంబై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మరిజనె కాప్ వేసిన  ఆ ఓవర్లో తొలి బంతికి  యస్తికా (1) ఔట్  కాగా మరుసటి బంతికే  సీవర్ క్లీన్ బౌల్డ్ అయింది. 

నాలుగో ఓవర్ వేసిన శిఖా పాండే.. మూడో బంతికి ప్రమాదకర హేలీ మాథ్యూస్ (5) ను  ఔట్ చేసింది. పాండే వేసిన బంతిని  లెగ్ సైడ్ దిశగా డ్రైవ్ చేసిన  మాథ్యూస్.. జెమీమా రోడ్రిగ్స్ అద్భుత క్యాచ్ తో వెనుదిరిగింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి  ముంబై చేసింది 19 పరుగులే. 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23, 3 ఫోర్లు) తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న  అమెలియా కెర్  (8) కూడా  అరుంధతి రెడ్డి  వేసిన  ఏడో ఓవర్లో ఐదో బంతికి  భాటియాకు క్యాచ్ ఇచ్చింది. 9వ ఓవర్లకు ముంబై స్కోరు 28 పరుగులే. ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రకార్ (19 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడింది.  పూనమ్ యాదవ్ వేసిన   పదో ఓవర్లో రెండు బౌండరీలు ఓ సిక్సర్ బాదింది. శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో కూడా   పూజా రెండు ఫోర్లు కొట్టింది.  

పూజా జోరుకు జొనాసేన్ అడ్డుకట్ట వేసింది.  ఆమె వేసిన 12వ ఓవర్లో  పూజా.. భారీ షాట్ ఆడగా బంతి వెళ్లి బౌండరీ లైన్ వద్ద ఉన్న రాధా యాదవ్ చేతిలో పడింది. ఇక  ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకున్న   కౌర్ కూడా  శిఖా పాండేనే వేసిన  15వ ఓవర్లో  రోడ్రిగ్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.  15 ఓవర్లకు ముంబై  స్కోరు  ఆరు వికెట్ల నష్టానికి  74 పరుగులే. 

 

75 కే ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో అసలు ముంబై వంద పరుగులైనా చేస్తుందా..? అనిపించింది. కానీ  అమన్‌జ్యోత్ కౌర్ (19), ఇస్సీ వాంగ్ (24 బంతుల్లో 23, 1 సిక్స్)  లు కలిసి  ఒక్కో పరుగు కూడదీస్తూ ముంబై స్కోరుకు  వంద దాటించారు.  ఢిల్లీ బౌలర్లలో కాప్, శిఖా పాండే, జెస్సీ జొనాసేసన్ లు తలా రెండు వికెట్లు తీయగా  అరుంధతి రెడ్డి ఒక వికెట్ పడగొట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios