యూపీని ఆదుకున్న మెక్‌గ్రాత్.. ఢిల్లీ బౌలర్లు కేకో కేకస్య కేకోభ్య:
WPL 2023: తమ చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ బ్యాటింగ్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. ఢిల్లీ బౌలర్లు మరోసారి రాణించి యూపీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

ప్లేఆఫ్స్ కు ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ బ్యాటింగ్ లో తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు తమ జోరు కొనసాగించారు. ఈ మ్యాచ్ కోసం ముగ్గురు కీలక ఆటగాళ్లను తప్పించి ఆడుతున్న యూపీ.. బ్యాటింగ్ లో అనుకున్న స్థాయిలో మెరుపులు మెరిపించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో యూపీ.. 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూపీ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి తహిలా మెక్‌గ్రాత్ (32 బంతుల్లో 58 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులే కారణం.
ఇక నిన్న ముంబై నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 9 ఓవర్లలోనే ఊదేసిన ఢిల్లీ.. 139 టార్గెట్ ను ఎన్ని ఓవర్లలో బాదుతుందో లేక యూపీ.. క్యాపిటల్స్ కు ఏమైనా షాకులిస్తుందో మరికొద్దిసేపట్లో తేలనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన యూపీ వారియర్స్ మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు శ్వేతా సెహ్రావత్ (12 బంతుల్లో 19, 4 ఫోర్లు), అలీస్సా హేలీ (34 బంతుల్లో 36, 4 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్ కు 4 ఓవర్లలోనే 30 పరగులు జోడించారు. శిఖా పాండే వేసిన మొదటి ఓవర్లో సెహ్రావత్ రెండు బౌండరీలు కొట్టింది. ఆ తర్వాత కాప్, మరిజనె బౌలింగ్ లలో కూడా మరో రెండు ఫోర్లు బాదింది.
కానీ రాధా యాదవ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి జొనాసేన్ కు క్యాచ్ ఇచ్చింది. ఆ తర్వాత యూపీ స్కోరు నెమ్మదించింది. క్యాప్సీ వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి బౌండరీ సాధించిన హేలీ.. మరుసటి బంతికే ముందుకొచ్చి ఆడబోయింది. కానీ బంతి మిస్ కావడంతో వికెట్ కీపర్ భాటియా స్టంపౌట్ చేసింది. రాధా యాదవ్ వేసిన 12వ ఓవర్లో చివరిబంతికి సిమ్రాన్ షేక్ (11) వెనుదిరిగింది.
ఆదుకున్న మెక్‌గ్రాత్..
స్కోరుబోర్డుపై పరుగులు తక్కువగా ఉండటంతో క్రీజులో ఉన్న తహిలా మెక్‌గ్రాత్.. దూకుడు పెంచింది. అరుంధతి రెండ్డి వేసిన 14వ ఓవర్లో మూడు బౌండరీలు బాదింది. ఆ ఓవర్లో యూపీకి 14 పరుగులొచ్చాయి. కానీ 15వ ఓవర్లో జొనాసేన్.. కిరణ్ నవ్‌గిరె (2) ఔట్ చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి యూపీ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు.
16వ ఓవర్ పూర్తిగా ఆడిన దీప్తి శర్మ (3) చేసింది రెండు పరుగులే రాధా యాదవ్ వేసిన 17వ ఓవర్లో మెక్‌గ్రాత్ రెండు బౌండరీలు బాది స్కోరుబోర్డును వంద పరుగులు దాటించింది. క్యాప్సీ వేసిన 18వ ఓవర్ తొలి బంతికే దీప్తిని భాటియా స్టంపౌట్ చేసింది. ఇదే ఓవర్లో సోఫీ ఎకిల్‌స్టోన్ (0) స్టంపౌట్ అయింది. జొనాసేన్ వేసిన తర్వాతి ఓవర్లో 14 పరుగులొచ్చాయి. క్యాప్సీనే వేసిన చివరి ఓవర్లో మెక్‌గ్రాత్.. 4, 6 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఢిల్లీ బౌలర్లలో క్యాప్సీ మూడు వికెట్లు తీయగా రాధా యాదవ్ రెండు, జొనాసేన్ ఒక వికెట్ దక్కించుకుంది.