ఢిల్లీ భళా.. అగ్రస్థానం క్యాపిటల్స్‌దే.. ప్లేఆఫ్స్‌కు ముంబై-యూపీ
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ మరో సూపర్ షో తో అదరగొట్టింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూపీ వారియర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. యూపీ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బౌలర్లతో పాటు బ్యాటర్లూ దూకుడు కొనసాగించి ఆ జట్టుకు సూపర్ విక్టరీని అందించారు. ఈ విజయంతో ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ - యూపీ వారియర్స్ ఎలిమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడతాయి. ఈ విజయంతో ఢిల్లీ.. డబ్ల్యూపీఎల్ తొలిసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు ఆ జట్టుకు మరోసారి శుభారంభాన్ని అందించారు. షఫాలీ వర్మ (16 బంతుల్లో 21, 4 ఫోర్లు), మెగ్ లానింగ్ (23 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లు తొల వికెట్ కు 4.5 ఓవర్లోనే 56 పరుగులు జోడించారు. షబ్నమ్ ఇస్మాయిల్ వేసిన తొలి ఓవర్లోనే లానింగ్.. 4, 4,4, 6 బాదింది. ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టింది.
వెంటవెంటనే వికెట్లు..
అంజలి వేసిన నాలుగో ఓవర్లో ఫోర్ కొట్టిన షఫాలీ.. యశశ్రీ వేసిన ఐదో ఓవర్ లో రెండు బౌండరీలు సాధించింది. కానీ అదే ఓవ్రలో ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి ఎకిల్‌స్టోన్ చేతికి చిక్కింది. వన్ డౌన్ లో వచ్చిన రోడ్రిగ్స్ (3) త్వరగానే నిష్క్రమించింది. షబ్నమ్ వేసిన ఏడో ఓవర్లో తొలి బంతికి రోడ్రిగ్స్.. వికెట్ల ముందు దొరికిపోయింది. కానీ ఆమె రివ్యూ కోరలేదు. టీవీ రిప్లైలో బంతి బ్యాట్ కు తాకిందని తేలింది. ఇదే ఓవర్లో ఐదో బంతికి లానింగ్ కూడా భారీ షాట్ ఆడి సిమ్రాన్ షేక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 8వ ఓవర్ వేసిన పర్శవి చోప్రా కూడా ఒకటే పరుగిచ్చింది.
క్యాప్సీ ఖతర్నాక్..
త్వరితగతిలో మూడు వికెట్లు కోల్పోవడంతో యూపీ బౌలర్లు మ్యాచ్ పై పట్టుబిగించాలని చూశారు. కానీ అలీస్ క్యాప్సీ (31 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాకతో వారి ఆటలు సాగలేదు. ఎకిల్‌స్టోన్ వేసిన 9వ ఓవర్లో క్యాప్సీ.. మూడు ఫోర్లు బాదింది. పర్శవి వేసిన పదో ఓవర్లో ఓ సిక్స్ కొట్టింది. పది ఓవర్లు ముగిసేటప్పటికీ ఢిల్లీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కానీ తర్వాతి 3 ఓవర్లలో 20 పరుగులొచ్చాయి. వచ్చీ రాగానే బాదుడు బాదిన క్యాప్సీ.. తర్వాత యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీకి పరుగుల రాక కష్టమైంది. క్యాప్సీకి తోడుగా మరిజనె కాప్ (31 బంతుల్లో 34 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా బాధ్యతాయుతంగా ఆడటంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. కానీ దీప్తి శర్మ వేసిన 16వ ఓవర్లో కాప్ భారీ సిక్సర్ బాదింది. ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి.
అయితే ఎకిల్‌స్టోన్ వేసిన 17వ ఓవర్లో రెండో బంతికి క్యాప్సీ స్టంపౌట్ అయింది. ఆ తర్వాత జొనాసేన్ రనౌట్ అయినా అప్పటికే విజయం ఖాయమైపోవడంతో ఢిల్లీ ఆందోళన చెందలేదు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ దారుణంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 138 పరుగులకే పరిమితమైంది. యూపీ బ్యాటర్ తహీలా మెక్‌గ్రాత్ (32 బంతుల్లో 58 నాటౌట్, 8 బౌండరీలు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ అలీస్సా హేలీ (36) ఫర్వాలేదనిపించింది. ఇక ఢిల్లీ బౌలర్లలో క్యాప్సీ మూడు వికెట్లు తీయగా రాధా యాదవ్ రెండు, జొనాసేన్ ఒక వికెట్ దక్కించుకుంది.
ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ :
ఢిల్లీ విజయంతో నేరుగా ఫైనల్ చేరడంతో ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయమయ్యాయి. ఈనెల 24న ముంబై ఇండియన్స్ - యూపీ వారియర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఈనెల 26న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగే ఫైనల్ లో తలపడనుంది.