WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ ఆల్ రౌండ్ షో తో అదరగొడుతోంది. మంగళవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ.. 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించినట్టే.. నేడు యూపీ వారియర్స్‌నూ ఓడించింది. ఢిల్లీ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్.. 5 వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఢిల్లీ.. 42 పరుగుల తేడాతో గెలుపొందింది. యూపీ ఆల్ రౌండర్ తహిల మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఆమెకు సహకరించేవాళ్లు కరువవడంతో యూపీకి ఓటమి తప్పలేదు. తొలి మ్యాచ్ లో గుజరాత్ పై మెరుపులు మెరిపించి ఉత్కంఠ విజయాన్ని అందుకున్న యూపీ.. నేటి మ్యాచ్ లో అలాంటి సంచలనాలేమీ నమోదుచేయలేదు.
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన యూపీ వారియర్స్ కు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. ధాటిగా ఆడుతున్న జట్టు సారథి అలీస్సా హేలి (17 బంతుల్లో 24, 5 ఫోర్లు) మరిజనె కాప్ వేసిన తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదింది. శిఖా పాండే వేసిన రెండో ఓవర్లో కూడా మూడు ఫోర్లు కొట్టింది. కానీ జొనాసేన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి రాధా యాదవ్ కు క్యాచ్ ఇచ్చింది.
అదే ఓవర్లో యూపీకి మరో భారీ షాక్. గత మ్యాచ్ లో ఫిఫ్టీ సాధించిన కిరణ్ నవ్‌గిరె (2) భారీ షాట్ ఆడబోయి క్యాప్సి చేతికి చిక్కింది. ఇక మరిజనె కాపన్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి శ్వేతా సెహ్రావత్ (1) కూడా వెనుదిరిగింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి యూపీ స్కోరు 33-3గా ఉంది.
తారా నోరిస్ వేసిన ఏడో ఓవర్ లో తొలి బంతికి దీప్తి శర్మ (20 బంతుల్లో 12, 1 ఫోర్) బౌండరీ బాది మెక్‌గ్రాత్ కు స్ట్రైక్ ఇచ్చింది. ఆ ఓవర్లో ఆమె.. చివరి రెండు బంతులను బౌండరీకి తలరించింది. జొనాసేన్ వేసిన 9వ ఓవర్లో మెక్‌గ్రాత్.. 6,4 బాదింది. పది ఓవర్లకు ఆ జట్టు స్కోరు 71-3గా ఉంది. కానీ 11వ ఓవర్లో తొలి బంతికి శిఖా పాండే వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన దీప్తి.. రాధా యాదవ్ సూపర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించింది. 14వ ఓవర్లో నాలుగో బంతికి డబుల్ తీయడం ద్వారా యూపీ వంద పరుగులు చేరింది.
మిడిల్ ఓవర్స్ లో ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీకి పరుగుల రాక కష్టమైంది. రాధాయాదవ్, క్యాప్సీ, శిఖా పాండేలు యూపీని కట్టడి చేశారు. 16 ఓవర్లు ముగిసేటప్పటికీ యూపీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేయగలిగింది. మిగిలిన నాలుగు ఓవర్లలో 99 పరుగులు చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో జొనాసేన్ వేసిన 17వ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్లో జొనాసేన్.. దేవికా వైద్య (23) ను కూడా ఔట్ చేసింది. మరిజనె కాప్ వేసిన 18వ ఓవర్లో.. తొలి బంతికి బౌండరీ కొట్టిన మెక్‌గ్రాత్.. అర్థ సెంచరీ (36 బంతుల్లో) పూర్తి చేసుకుంది. ఈ ఓవర్లో ఆమె నాలుగు ఫోర్లు కొట్టి 17 పరుగులు రాబట్టింది. జొనాసేన్ వేసిన 19వ ఓవర్లో 18 పరుగులొచ్చాయి. ఇక చివరి ఓవర్ వేసిన అరుంధతి రెడ్డి.. 14 పరుగులిచ్చింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (70) వీరబాదుడుకు తోడు జొనాసేన్ (42 నాటౌట్), రోడ్రిగ్స్ (34 నాటౌట్) లు మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.
