Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఢీలా ముంబై భళా.. ఒత్తిడికి చిత్తైన క్యాపిటల్స్.. హర్మన్ సేన ముందు ఈజీ టార్గెట్

WPL 2023 Finals: మహిళల ప్రీమియర్ లీగ్ తుది పోరులో ఢిల్లీ బ్యాటర్లను ముంబై బౌలర్లు  రఫ్ఫాడించారు. ముంబై ధాటికి ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడానికి ముంబై  అత్యంత చేరువగా వచ్చింది.   

WPL 2023: Delhi Capitals All Out, Mumbai Indians Need 132 Runs To Win First Ever Trophy MSV
Author
First Published Mar 26, 2023, 9:07 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు రెచ్చిపోయారు.  ఈ టోర్నీ ఆసాంతం  దూకుడుగా ఆడిన ఢిల్లీని ముప్పుతిప్పలు పెట్టారు. తుది పోరులో ఢిల్లీ  బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారు. క్యాపిటల్స్‌ను తొలుత ఇసీ వాంగ్  దెబ్బతీయగా  ఆ తర్వాత  స్పిన్నర్లు కెర్,  మాథ్యూస్ లు  ఢిల్లీ బ్యాటర్లను  క్రీజులో కుదురుకోనివ్వలేదు.  ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీలో  కెప్టెన్ మెగ్ లానింగ్  (29 బంతుల్లో 35,  5 ఫోర్లు)   ఒక్కతే కాస్త ప్రతిఘటించింది. ఆఖర్లో శిఖా పాండే  (17 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్), రాధా యాదవ్ (12 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. మిగిలినవారు క్రీజులో నిలబడేందుకు తటపటాయించారు.  ఫలితంగా ఢిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది. మరి స్వల్ప లక్ష్యాన్ని  ముంబై బ్యాటర్లు ఛేదించి  తొలి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడతారా..? లేక  ఢిల్లీ బౌలర్లు ఏమైనా మాయ చేస్తారో వేచి చూడాలి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన  ఢిల్లీ క్యాపిటల్స్..   సీవర్ వేసిన తొల ఓవర్లో  రెండు పరగులే రాబట్టింది. వాంగ్ వేసిన  రెండో ఓవర్లో  తొలి బంతికే సిక్సర్ బాదిన  షఫాలీ.. రెండో బంతికి ఫోర్ కొట్టింది.  ఆడిన నాలుగు బంతుల్లోనే  11 పరుగులు చేసిన  షఫాలీ.. అదే ఓవర్లో  మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి  కెర్ చేతికి చిక్కింది.  బంతి  నడుము ఎత్తులో  రావడంతో  ఢిల్లీ రివ్యూ కోరినా ఫలితం వారికి వ్యతిరేకంగానే వచ్చింది. ఇదే ఓవర్లో  ఐదో బంతికి  అలీస్ క్యాప్సీ (0) కూడా  ఇదే రకమైన బంతికి బోల్తా కొట్టింది.  క్యాప్సీ క్యాచ్ ను  అమన్‌జ్యోత్ కౌర్   అద్భుతంగా అందుకుంది.  

సీవర్ వేసిన  మూడో ఓవర్లో  లానింగ్ రెండు బౌండరీలు కొట్టగా  రోడ్రిగ్స్ కూడా  ఓ ఫోర్ కొట్టింది. కానీ మళ్లీ వాంగ్ వేసిన ఇన్నింగ్స్  ఐదో ఓవర్లో  రెండో బంతికి   రోడ్రిగ్స్ (9).. లో ఫుల్ టాస్ ను అవుట్ సైడ్ దిశగా ఆడగా హేలీ మాథ్యూస్  క్యాచ్ అందుకుంది. దీంతో ఢిల్లీ మూడో వికెట్ కూడా కోల్పోయింది.  

ఆదుకున్న లానింగ్-కాప్

ఐదు ఓవర్లలో 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ఢిల్లీని  కెప్టెన్ మెగ్ లానింగ్,  ఆదుకుంది.  రోడ్రిగ్స్ స్థానంలో వచ్చిన మరియనె కాప్ (21 బంతుల్లో  18, 2 ఫోర్లు) తో కలిసి   ఐదో వికెట్ కు 37 బంతుల్లో 38 పరుగులు  జోడించింది.  కెర్ వేసిన  ఏడో ఓవర్లో  లానింగ్ రెండు ఫోర్లు కొట్టింది.  సైకా ఇషాక్ వేసిన  పదో ఓవర్లో   కాప్, లానింగ్ లు తలా ఓ  బౌండరీ సాధించారు. 

వచ్చారు.. వెళ్లారు..

కుదురుకుంటున్నట్టే కనిపించిన  ఢిల్లీ ఇన్నింగ్స్ కు  కెర్ షాకిచ్చింది. కెర్ వేసిన 11వ ఓవర్లో  రెండో బంతికి బౌండరీ  సాధించిన కాప్.. ఆ తర్వాతి బంతికే  వికెట్ కీపర్ యస్తికాకు క్యాచ్ ఇచ్చింది. దీంతో  ఢిల్లీ నాలుగో వికెట్  నష్టపోయింది.   ఆ తర్వాతి ఓవర్లో ఢిల్లీ  లానింగ్  వికెట్ ను కోల్పోయింది.  మాథ్యూస్ వేసిన   12వ ఓవర్లో నాలుగో బంతికి  జొనాసేన్  కవర్స్ దిశగా బంతిని పంపి సింగిల్ కోసం లానింగ్ ను పిలిచింది.   అయితే  అక్కడే ఉన్న అమన్‌జ్యోత్ త్వరగా స్పందించి  బంతిని యస్తికాకు విసరడం.. ఆమె వికెట్లను గిరాటేయం క్షణాల్లోనే జరిగిపోయాయి. ఆ తర్వాత 13వ ఓవర్ వేసిన  కెర్.. చివరి బంతికి అరుంధతి రెడ్డిని ఔట్ చేసింది. ఇక 14వ ఓవర్ వేసిన  మాథ్యూస్ బౌలింగ్ లో జొనాసేన్ (2)  తొలి బంతికి ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా అది మిస్ అయింది.  కానీ  మరుసటి బంతికే ఆమె  అదే రీతిన  క్యాచ్ ఇచ్చింది.  అయతే ఈసారి మాథ్యూస్ మిస్ చేయలేదు.  

ఆఖర్లో శిఖా పాండే, రాధా యాదవ్ మెరుపులు.. 

మాథ్యూస్ వేసిన  16వ ఓవర్లో  మిన్ను మణి  (1) ని  యస్తికా స్టంపౌట్ చేసింది. ఆ మరుసటి బంతికే తాన్యా భాటియా  (0) క్లీన్ బౌల్డ్ అయింది. అయితే  చివర్లో రాధా యాదవ్ ( ) తో కలిసి  శిఖా పాండేలు ఢిల్లీకి విలువైన పరుగులు అందించారు. ముఖ్యంగా శిఖా పాండే.. వాంగ్ వేసిన  19వ ఓవర్లో   6, 4, 4 బాదింది. ఇదే ఓవర్లో రాధా కూడా ఓ బౌండరీ బాదింది. ఈ ఓవర్లో ఢిల్లీ 20 పరుగులు రాబట్టింది. సీవర్ వేసిన ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.  ఈ ఇద్దరూ పదో వికెట్ కు 24 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో  వాంగ్, మాథ్యూస్ లు తలా మూడు వికెట్లు తీయగా కెర్ రెండు వికెట్లు పడగొట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios