డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం అందుకున్న ముంబై ఇండియన్స్..  షెఫాలీ వర్మ అవుట్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్న క్రికెట్ ఫ్యాన్స్... మరోసారి తెరపైకి అంబానీ ట్రోల్స్...  

ఐపీఎల్‌లో సీఎస్‌కే గెలిస్తే ఆ క్రెడిట్ ధోనీ ఖాతాలోకి వెళ్తుంది, కానీ ముంబై ఇండియన్స్ గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ కంటే ఎక్కువగా ఆ జట్టు యజమాని ముఖేశ్ అంబానీకే కట్టచెబుతారు కొందరు యాంటీ ఫ్యాన్స్. ముంబై ఇండియన్స్ ఫైనల్‌లో ఎంత బాగా ఆడినా ప్రతీ మ్యాచ్‌లో జరిగే చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చేసి చూపిస్తే, అంబానీ వల్లే ఆ టీమ్... టైటిల్ గెలిచిందని అంటారు...

కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకే ఇది పరిమితం కాలేదు, ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇదే రకమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. దీనికి కారణం ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా ఏడుసార్లు డీఆర్‌ఎస్‌ని ఉపయోగించాయి ఇరుజట్లు. ఇందులో నాలుగు సార్లు నిర్ణయాలు ముంబై ఇండియన్స్‌కి అనుకూలంగా రాగా మూడు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది...

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెరుపు ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేసింది యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ. 4 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసింది. అయితే రెండో ఓవర్‌లో ఇసీ వాంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన షెఫాలీ వర్మ, అమీలియా కేర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది..

మొదటి ఓవర్‌లో 2 పరుగులే రాగా రెండో ఓవర్ తొలి బంతికి 6, తర్వాతి బంతికి 4 బాదిన షెఫాలీ వర్మ, మూడో బంతికి అవుటైంది. అయితే ఈ నిర్ణయంపై వివాదం రేగింది. షెఫాలీ వర్మ అవుట్‌ని ముంబై ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటుండగా నాన్‌-స్టైయికర్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్, హైట్ నోబ్ కోసం డీఆర్‌ఎస్ తీసుకుంది...

Scroll to load tweet…

ఇసీ వాంగ్ వేసిన ఫుల్ టాస్‌, షెఫాలీ వర్మ భుజాల హైట్‌లో వచ్చినట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. బాల్ ట్రాకింగ్‌లో కూడా బంతి నేరుగా వికెట్ల పైనుంచి వెళ్తునట్టుగా చూపించింది. ఐసీసీ రూల్ 41.7 ప్రకారం దీన్ని నో బాల్‌‌గా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే టీవీ అంపైర్ పశ్చిమ్ పథక్ మాత్రం దాన్ని నో బాల్‌గా ఇచ్చేందుకు ఇష్టపడలేదు... దీంతో షెఫాలీ వర్మతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా షాకైంది..

రెండో ఓవర్‌లో తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్, అలీస్ క్యాప్సీ డకౌట్ కావడం, జెమీమా రోడ్రిగ్స్ 9 పరుగులకే పెవిలియన్ చేరడంతో 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మెరిజానే క్యాప్ 18, మెగ్ లానింగ్ 35 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..

ఈ దశలో శిఖాపాండే 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు, రాధా యాదవ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి రాణించి ఢిల్లీ క్యాపిటల్స్‌కి 131 పరుగుల బాధ్యతాయుత స్కోరు అందించారు. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్..