ముంబైని ముంచిన అతి విశ్వాసం.. డైరెక్ట్ ఫైనల్ ప్లేస్ ఢమాల్.. ప్లేఆఫ్ ఆడాల్సిందేనా..?
WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంటున్న వేళ టేబుల్ టాపర్స్ మారారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓడటంతో ఆ జట్టు ఫైనల్ ఆడే స్థితి నుంచి ప్లేఆఫ్స్ ఆడే దుస్థితికి పడిపోయింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలుత ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ గెలిచి తమకు ఎదురేలేదని చాటిచెప్పిన ముంబై ఇండియన్స్ కు షాక్ తాకింది. ఐదు మ్యాచ్ లు గెలవడంతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించామన్న లెక్కలేనితనమో..? లేక తమకు ఎదురులేదన్న అతివిశ్వాసమో గానీ రెండు మ్యాచ్ లలో ఓటమితో ఆ జట్టు ఆకాశం నుంచి నేలకు దిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అవమానకర ఓటమితో ఆ జట్టు అదృష్టం ఒక్కసారిగా తలకిందులైంది.
ఢిల్లీ చేతిలో దారుణంగా ఓడటంతో ఈ మ్యాచ్ కు ముందు వరకూ టేబుల్ టాపర్స్ గా ఉన్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ.. ఏడు మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించింది. ముంబై కూడా ఏడు మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలతో పది పాయింట్లతోనే ఉంది.
కానీ నెట్ రన్ రేట్ విషయంలో ఈ రెండు జట్ల మధ్య చిన్న అంతరం ముంబైని నేరుగా ఫైనల్ ఆడే స్థితి నుంచి ప్లేఆఫ్స్ కు పడిపోయేలా చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ నెట్ రన్ రేట్ +1.978 గా ఉండగా ముంబైకి +1.725 ఉంది. రెండింటి మధ్య ఉన్న తేడా కూడా 0.25 పాయింట్లు మాత్రమే..
నిబంధనలు ఇవి..
- డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
- రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడతాయి.
- అంటే ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం.. ఢిల్లీ నేరుగా ఫైనల్ (?) చేరితే యూపీ వారియర్స్ తో కలిసి ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
నేరుగా ఫైనల్ కు వెళ్లేందుకు ఓ ఛాన్స్ ఉంది..
- అయితే ఇలా జరుగకూడదంటే మంగళవారం ఆర్సీబీతో ఆడబోయే మ్యాచ్ ముంబైకి కీలకం. ఈ మ్యాచ్ లో బెంగళూరును భారీ తేడాతో ఓడిస్తే అప్పుడు ఆ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది. ఇదే క్రమంలో ఢిల్లీ కూడా.. రేపు యూపీ వారియర్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో యూపీ గనక ఢిల్లీని చిత్తుగా ఓడిస్తే అప్పుడు ముంబై మళ్లీ మొదటి స్థానానికి వెళ్లనుంది. అలా జరిగితే ముంబై.. నేరుగా ఫైనల్ ఆడొచ్చు. లేదంటే ప్లేఆఫ్స్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లాల్సి ఉంటుంది.
ఆర్సీబీ, యూపీ ఔట్..
కాగా సోమవారం మధ్యాహ్నం యూపీ వారియర్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూపీ గెలవడంతో గుజరాత్ తో పాటు ఆర్సీబీ కూడా ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. రేపు ముంబైతో జరిగే మ్యాచ్ లో గెలిచి గెలుపుతో సీజన్ ముగించడం తప్ప స్మృతి మంధాన అండ్ కో.కు మరో ఆప్షన్ లేదు. ఇక గుజరాత్ కథ నేటితోనే ముగిసింది.
తుది దశకు చేరుకున్న ఈ లీగ్ లో మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. మంగళవారం ఆర్సీబీ - ముంబై మధ్య మధ్యాహ్నం ఒక మ్యాచ్ జరుగనుండగా ఢిల్లీ - యూపీ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. మొదటి మూడు స్థానాలు ఖరారైన తర్వాత ఈనెల 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మార్చి 26 (వచ్చే ఆదివారం).. బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఫైనల్ జరుగనుంది. డబ్ల్యూపీఎల్ ముగిసిన తర్వాత మార్చి 31 నుంచి క్రికెట్ అభిమానులకు రెండు నెలల పండుగ ఐపీఎల్ మొదలుకానుంది.