TATA IPL 2022: కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయినా అతడిని మాత్రం ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. నీ సేవలకో దండం బాబు.. ఇక వెళ్లు.. అని బతిమిలాడుతున్నారు.ఎందుకు..?
ప్రపంచంలో నెంబర్ వన్ టెస్టు బౌలర్ అతడు. ఇటీవలే ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు సారథిగా కూడా నియమితుడయ్యాడు. వరుసగా రెండు టెస్టు సిరీస్ లు నెగ్గాడు. ప్రతిష్టాత్మక యాషెస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి.. తర్వాత రెండున్నర దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ కు వచ్చి ఆ జట్టుపై కూడా సిరీస్ విజయాన్ని అందించాడు. అదే ఊపులో ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. వేలంలో రూ. 7.25 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు తమ రాత మారుస్తాడని ఫ్రాంచైజీతో పాటు ఆ జట్టు అభిమానులు ఆశించారు. కానీ.. తాను ఒకటి తలిస్తే కాలం మరోకటి తలిచింది.
కేకేఆర్ ఇప్పటివరు ఆరు మ్యాచులాడింది. ఇందులో చివరి 4 మ్యాచులాడిన ప్యాట్ కమిన్స్.. బౌలింగ్ లో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. నాలుగు మ్యాచులలో కలిపి ఏకంగా 190 పరుగులిచ్చుకున్నాడు.
ముంబై తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన కమిన్స్.. 49 పరుగులిచ్చాడు. రెండు వికట్లు తీశాడు. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో 3.5 ఓవర్లు విసిరి 40 పరుగులిచ్చాడు. తీసింది ఒక వికెటే. ఇక రాజస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చాడు. తీసింది ఒక వికెట్ మాత్రమే. మొత్తంగా 4 మ్యాచులలో సుమారు 15.5 ఓవర్లలో 190 పరుగులిచ్చాడు. తీసింది నాలుగే వికెట్లు.
కమిన్స్ చెత్త ప్రదర్శనతో కేకేఆర్ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘నీ సేవలకో దండం బాబు.. ఇక నువ్వు తప్పుకుంటే మంచిది..’ అని కామెంట్స్ చేస్తున్నారు. కమిన్స్ తపపుకుని ఆ అవకాశం టిమ్ సౌథీకి ఇవ్వవాలని కోరుతున్నారు. వరుస మ్యాచులలో 11 సగటుతో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న కమిన్స్ కు వీడ్కోలు పలికి సౌథీకి అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
డెత్ ఓవర్లతో పాటు పవర్ ప్లేలో సౌథీ.. కమిన్స్ కంటే బాగా బౌలింగ్ చేస్తాడని, అతడిని ఎందుకు పక్కనపెడుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమిన్స్ తో పోల్చితే సౌథీ చాలా బెటరని, వెంటనే అతడిని ఆడించాలని కోరుతున్నారు. మరి కేకేఆర్ యాజమాన్యం అభిమానుల డిమాండ్లను మన్నిస్తుందా..?
కమిన్స్ రాకముందు సౌథీ.. కేకేఆర్ తరఫున రెండు మ్యాచులాడాడు. బెంగళూరు, పంజాబ్ తో మ్యాచులు ఆడి ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ కేకేఆర్ యాజమాన్యం మాత్రం అతడిని పక్కనబెట్టి ధారాళంగా పరుగులిస్తున్న కమిన్స్ నే ఆడిస్తుండటం గమనార్హం.
