న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన అంశం ఓవర్ త్రో. ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ ఆడిన బంతిని బౌండరీ లైన్ వద్ద అందుకున్న కివీస్ ఫీల్డర్ గప్టిల్.. వికెట్ల మీదకు విసిరేశాడు.

అది పరుగు కోసం ప్రయత్నిస్తున్న స్టోక్స్ బ్యాట్‌కి తగిలి బౌండరికీ చేరింది. దీంతో ఇంగ్లాండ్‌కు ఓవర్‌త్రో కలిపి మొత్తం ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ చట్టాల్లో సవరణలు చేయాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అడుగులు వేస్తోంది.

మరోవైపు ఫైనల్ నాటి ఓవర్ త్రో వివాదానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా వచ్చే నెలలో మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, కుమార సంగక్కర సభ్యులుగా గల ప్రపంచ క్రికెట్ కమీటీ సమావేశం కానుంది.

ఈ కమిటీ ముందు ఫైనల్‌లో ఫీల్డ్ ఎంపైర్‌గా వ్యవహరించిన కుమార ధర్మసేన హాజరుకానున్నాడు. ఓవర్‌ త్రో కు సంబంధించి డబ్ల్యూసీసీ చట్టంలోని 19.8 నిబంధన గురించి చర్చించిందని.. చట్టం స్పష్టంగానే వుందని కమిటీ అభిప్రాయపడింది.

అయితే ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో న్యాయ నిపణుల కమిటీ సమీక్షిస్తుందని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.  అలాగే ఆ సమావేశంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆటగాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంతో పాటు ఆటోమేటెడ్ కాలింగ్ విధానంలో నో బాల్స్‌‌ గురించి చర్చించినట్లు పేర్కొంది.

అలాగే ఆన్-ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్ గుర్తించడానికి వీలుగా బాల్-ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలని సూచించింది. నడుము వరకు వచ్చినా లేదా తలపైకి వచ్చిన బంతులు నో బాల్స్, వైడ్లు గుర్తించడానికి సదరు సాఫ్ట‌వేర్ సహకరిస్తుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.