Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్‌లో ఫ్యామిలీ ముందు అదరగొట్టిన మియా.. నా కొడుకు వరల్డ్ కప్ ఆడాలి : సిరాజ్ తల్లి

INDvsNZ: హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో ముగిసిన  తొలి వన్డేలో భారత విజయానికి శుభమన్ గిల్ తో పాటు  మహ్మద్ సిరాజ్ కూడా కీలక భూమిక పోషించాడు. ఈ మ్యాచ్ కు సిరాజ్ కుటుంబం తరలొచ్చింది. 

World Cup bhi khele mera baccha : Mohammed Siraj's Mother Comments
Author
First Published Jan 19, 2023, 5:39 PM IST

గడిచిన ఏడాదికాలంగా   టెస్టులతో పాటు వన్డేలలో కూడా అదరగొడుతున్న  హైదరాబాదీ కుర్రాడు  మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ లపై  స్వింగ్ ను రాబడుతూ  టీమిండియా విజయాల్లో కీలకంగా మారుతున్నాడు.  ఇటీవలే ముగిసిన శ్రీలంకతో సిరీస్ లో  మూడు వన్డేలలో 9 వికెట్లతో చెలరేగిన  సిరాజ్.. నిన్న సొంతగడ్డ మీద  కూడా  రెచ్చిపోయాడు.  ఉప్పల్ లో సిరాజ్.. నాలుగు వికెట్లు తీశాడు. 

2017  నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా హైదరాబాద్ లో ఆడటం సిరాజ్ కు ఇదే ప్రథమం.  ఈ సందర్భంగా సిరాజ్ ఫ్యామిలీ.. నిన్న ఉప్పల్ లో సందడి చేసింది.   తన తల్లి, సోదరుడు, కుటుంబసభ్యులు, స్నేహితులు చూస్తుండగా  సిరాజ్  దుమ్మురేపాడు.  ఓపెనర్ కాన్వే, ఆ జట్టు సారథి టామ్ లాథమ్ లతో పాటు కీలకమైన మిచెల్ సాంట్నర్ వికెట్ కూడా సిరాజ్ కే దక్కింది. షిప్లే వికెట్ సైతం సిరాజ్ ఖాతాలోనే పడింది.  

అయితే  సొంతగడ్డపై తన కొడుకు ప్రదర్శనను తిలకించిన  సిరాజ్ తల్లి సంతోషానికి అవధుల్లేవు.  ఉప్పల్ స్టేడియం అంతా ‘సిరాజ్.. సిరాజ్’ అని అరుస్తుంటే ఆ తల్లి కళ్లల్లో మాతృప్రేమతో  కన్నీళ్లు ఉప్పొంగాయి.   కాగా  మ్యాచ్ కు ముందు సిరాజ్ తల్లి, స్నేహితులు అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఓ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో షేర్  చేసింది. 

ఈ సందర్భంగా సిరాజ్ తల్లి మాట్లాడుతూ.. ‘నేను  అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా  సిరాజ్  ఇలాంటి మంచి ప్రదర్శనలు చేయాలని కోరుకుంటున్నా. నిలకడగా ఆడి  వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకుంటాడని నేను భావిస్తున్నా..’  అని తెలిపింది. 

ఇదిలాఉండగా సిరాజ్ పై గతంలో  వచ్చిన విమర్శలకు అతడు తన  ప్రదర్శనతోనే సమాధానం చెబుతున్నాడు. కోహ్లీ కారణంగా జట్టులో నెట్టుకొస్తున్నాడని, సిరాజ్ కు అంత సీన్ లేదని   అన్నవారూ లేకపోలేదు. లైన్ అండ్ లెంగ్త్ ఉండదని,  పవర్ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడని,  ధారాళంగా పరుగులిస్తాడనేది సిరాజ్ పై ప్రధానంగా ఉన్న విమర్శ.  అయితే గత ఏడాది కాలంగా  సిరాజ్ పై ఈ అపవాదులన్నీ తొలిగిపోతున్నాయి.  బుమ్రా లేని  లోటును పూడుస్తూ  యావత్ భారతావణి గర్వపడేలాగా అతడి ప్రదర్శన సాగుతోంది.  

 

అంతర్జాతీయ క్రికెట్  లో సిరాజ్... 15 టెస్టులలో 46 వికెట్లు,  20 వన్డేలలో 37 వికెట్లు, 8 టీ20లలో 11 వికెట్లు పడగొట్టాడు.  బుమ్రా గైర్హాజరీలో  వన్డే వరల్డ్ కప్ కు తాను కూడా  ప్రధాన పోటీదారునని  చెప్పకనే చెబుతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios