ఏప్పిల్ 3న ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్... ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అధికారుల్లో సగానికి పైగా మహిళలే...
ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ తుది దశకు చేరుకుంది. ఆదివారం ఏప్పిల్ 3న క్రిస్ట్ చర్చ్‌లోని హగ్లే ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీని ఇప్పటికే ఆస్ట్రేలియా అత్యధిక ఆరు సార్లు సొంతం చేసుకోగా.. ఇంగ్లాండ్ జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది... ఈ రెండు జట్లు కాకుండా న్యూజిలాండ్ మాత్రమే 2000వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించగలిగింది.
వుమెన్స్ వరల్డ్ కప్‌కి ఈ సారి కాస్త ఆదరణ పెరిగింది. మునుపటి సీజన్లతో పోలిస్తే, ఈసారి వుమెన్స్ క్రికెట్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. త్వరలో మహిళా క్రికెట్‌కి కూడా మంచి రోజులు రాబోతున్నాడనే ఆశలు చిగురించాయి...
వుమెన్స్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ కోసం మొట్టమొదటిసారి నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలకు బాధ్యతలు అప్పగించింది ఐసీసీ. మొట్టమొదటి భారత రిఫరీ జీఎస్ లక్ష్మీతో పాటు మరో ముగ్గురు మహిళలు, వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌కి రిఫరీలుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు...
పురుషుల క్రికెట్‌కి రిఫరీగా వ్యవహరించిన మొట్టమొదటి మహిళగా లక్ష్మీ, ఇప్పటికీ రికార్డు క్రియేట్ చేసింది. సౌతాఫ్రికా మహిళా మాజీ క్రికెటర్ లారెన్ అగెన్‌బగ్, న్యూజిలాండ్ మహిళా మాజీ క్రికెటర్ కిమ్ కాటన్... ఫైనల్ మ్యాచ్‌కి ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించబోతున్నారు...
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జాక్వెలిన్ విలియమ్స్, టీవీ అంపైర్‌గా వ్యవహరించనుంది. మెల్‌బోర్న్‌లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అక్సన్ రాజాతో కలిసి ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించింది కిమ్ కాటన్...
2020లో ఐర్లాండ్, వెస్టిండీస్ పురుషుల జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచుల సిరీస్‌కి థర్డ్ అంపైర్‌గా వ్యవహరించిన జాక్వెలిన్ విలియమ్స్, పురుషుల క్రికెట్‌కి థర్డ్ అంపైర్‌గా చేసిన మొట్టమొదటి మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. జింబాబ్వేకి చెందిన లంగ్టన్ రుస్సేరే ఫోర్త్ అంపైర్‌గా ఎంపికయ్యారు...
‘క్రికెట్‌లో పురుషాధిక్యం, లింగ బేధాలు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటలో అందరూ సమానమేనని చాటడానికి ఇది ఓ మంచి ప్రయత్నంగా మారుతుంది... వుమెన్స్ వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో సేవలు అందించే 15 మందిలో 8 మంది ఆడవాళ్లే ఉండబోతున్నారు...’ అని తెలిపింది ఐసీసీ అపెక్స్ కమిటీ...
భారీ అంచనాలతో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన భారత మహిళా జట్టు, గ్రూప్ స్టేజీకే పరిమితమైన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచుల్లో విజయాలు అందుకున్న మిథాలీ సేన, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి పరాజయం పాలైంది...
వుమెన్స్ వరల్డ్ కప్ 2017లో ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్ చేరిన భారత మహిళా జట్టు, ఈసారి గ్రూప్ స్టేజీకే పరిమితం కావడం విశేషం. 2017లో భారత జట్టును ఫైనల్‌లో ఓడించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది ఇంగ్లాండ్..
