ప్రపంచ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి  అవదుల్లేకుండా పోయింది. ఇలా ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన ఘన విజయంతో ఈ సంబరాల డోస్ పెంచాలనుకుంటున్న వారికి యువరాజ్ సింగ్ షాకింగ్ న్యూస్ అందించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు యువీ ప్రకటనను చూసి టీమిండియా అభిమానుల ఆనందం ఒక్కసారిగా ఆవిరయ్యింది.  ఇంకేముంది యువీ భావవోద్వేగానికి అభిమానుల భావోద్వేగం తోడవడంతో భారత క్రికెట్లో నిన్న (సోమవారం) మొత్తం ఈ రిటైర్మెంట్ పైనే చర్చ జరిగింది. 

అయితే తన రిటైర్మెంట్ గురించి యువీ ముందుగా ఎలాంటి లీకులివ్వలేదు. అనూహ్యంగా ఒక్కసారి ఈ ప్రకటన చేయడంతో అభిమానులే కాదు టీమిండియా ఆటగాళ్లు, మాజీలతో పాటు అతడి సన్నిహితులు కూడా ఆశ్యర్యానికి గురయ్యారు. కానీ తాను అత్యంత సన్నిహితంగా వుండే ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఈ రిటైర్మెంట్ విషయాన్ని ముందే చెప్పినట్లు యువీ వెల్లడించాడు. 

క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ మాంత్రికుడు, యువీకి అత్యంత సన్నిహితుడు హర్భజన్ సింగ్ కు ఈ విషయం గురించి ముందే తెలుసట. స్వయంగా తానే వారికి ఈ విషయాన్ని తెలియజేసి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా నా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా నాన్నతో సుధీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాడు. చాలారోజుల తర్వాత ఆయనతో ఇంత సుదీర్ఘంగా మాట్లాడానని...ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నానని అన్నాడు. ఇలా వీరందరి సలహాలు, సూచనలను స్వీకరిస్తూనే... నేను నిర్ణయించుకున్నట్లుగానే రిటైర్మెంట్ ను ప్రకటించినట్లు  యువీ వెల్లడించాడు.