T20 World cup 2023: టీమిండియా ముందు 173 పరుగుల భారీ టార్గెట్... చితక్కొట్టిన బెత్ మూనీ, మెగ్ లానింగ్! క్యాచ్ డ్రాప్‌లతో భారీ మూల్యం చెల్లించుకున్న టీమిండియా.. 

క్యాచ్ డ్రాప్ చేస్తే మ్యాచ్ డ్రాప్ చేసినట్టే! క్రికెట్‌ మ్యాచ్ గెలవాలంటే ఇది ప్రాథమిక సూత్రం. అయితే ఆస్ట్రేలియా వంటి పటిష్ట టీమ్‌తో సెమీ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు, ఫీల్డింగ్‌తో తప్పుల మీద తప్పులు చేసింది. చేతుల్లోకి వచ్చిన నాలుగు ఈజీ క్యాచులను జారవిడిచిన భారత మహిళా జట్టు... ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించింది..

ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్ల ఆడేందుకు ఆసీస్ ఓపెనర్లు కష్టపడ్డారు.

26 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన అలీసా హీలి... రాధా యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యింది. 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆసీస్. భారత ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెత్ మూనీ, 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది..

టీమిండియపై బెత్ మూనీకి ఇది 8వ హాఫ్ సెంచరీ. ఒకే దేశంపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది బెత్ మూవీ. భారత బ్యాటర్ స్మృతి మంధాన, ఇంగ్లాండ్‌పై 7 హాఫ్ సెంచరీలు బాది రెండో స్థానంలో ఉంది. పురుషుల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాపై టీ20ల్లో 8 హాఫ్ సెంచరీలు బాదితే.. మహిళల క్రికెట్‌లో బెత్ మూనీ, భారత జట్టుపై ఈ ఫీట్ సాధించింది.

బెత్ మూనీ 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ డ్రాప్ చేసింది షెఫాలీ వర్మ. షెఫాలీ చేతుల్లో పడిన బంతి, జారి కింద పడి బౌండరీ లైన్ దాటడంతో ఫోర్ కూడా వచ్చేసింది. 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన బెత్ మూనీ, శిఖా పాండే బౌలింగ్‌లో షెఫాలీ వర్మకే క్యాచ్ ఇచ్చి అవుటైంది..

అష్‌లీ గార్నర్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన గ్రేస్ హారిస్, శిఖా పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా ఆస్ట్రేలియా స్కోరు వేగం మాత్రం తగ్గలేదు...

కెప్టెన్ మెగ్ లానింగ్ ఓ ఎండ్‌లో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రేణుకా సింగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్ బాదిన మెగ్ లానింగ్, ఆఖరి బంతికి సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టింది. 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది మెగ్ లానింగ్. ఆస్ట్రేలియా ఆఖరి 10 ఓవర్లలో 103 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు తీయగా దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.