T20 World cup 2023: పాకిస్తాన్‌పై 114 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న ఇంగ్లాండ్... బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కి సౌతాఫ్రికా మహిళా జట్టు... 

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ గ్రూప్ మ్యాచులు ముగిశాయి. గ్రూప్ బీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళా జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో 114 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్ డానిల్లె వ్యాట్ 33 బంతుల్ల 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేయగా నాట్ సివర్ బుంట్ 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌‌తో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్ 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళా జట్టు 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగిది..

ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ సదాఫ్ సమస్ డకౌట్ కావడంతో మొదలైన పాక్ వికెట్ల పతనం, ఏ దశలోనూ ఆగలేదు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్, 15 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. మునీబా ఆలీ 3, ఓమైమా సోహైల్ 9, సిద్రా ఆమీన్ 12, నిదా దర్ 11, అలియా రియాజ్ 5, ఫాతిమా సనా 16, సిద్రా నవాజ్ 3, తుబా హసన్ 28, నిశ్రా సంధు 1 పరుగు చేశారు. ఈ విజయంతో గ్రూప్ బీలో ఇంగ్లాండ్ 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది..

గ్రూప్ ఏలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళలు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. 

ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది సౌతాఫ్రికా మహిళా జట్టు. లౌరా వాల్వర్ట్ 56 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేయగా తజ్మిన్ బ్రిట్స్ 51 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌతాఫ్రికా మహిళా జట్టు, సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది..

గ్రూప్ ఏ టాపర్ ఆస్ట్రేలియాతో, గ్రూప్ బీలో రెండో పొజిషన్‌లో ఉన్న భారత మహిళా జట్టు .. గురువారం ఫిబ్రవరి 23న మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ బీ టాపర్ ఇంగ్లాండ్‌తో, గ్రూప్ ఏలో రెండో పొజిషన్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు, శుక్రవారం ఫిబ్రవరి 24న రెండో సెమీ ఫైనల్ ఆడనుంది. సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 26న కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది...