అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ గండాన్ని దాటుతుందా? 

ఐసీసీ ఉమెన్స్ అండర్19 టీ20 వరల్డ్ కప్‌‌లో భాగంగా నేడు భారత జట్టు, న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా, ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

భారత జట్టు: షెఫాలీ వర్మ, శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారి, గొంగడి త్రిషా, రిచా ఘోష్, హృషిత బసు, తితాస్ సదు, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, పర్శవి చోప్రా, సోనమ్ యాదవ్

న్యూజిలాండ్ జట్టు: అన్నా బ్రోనింగ్, ఎమ్మా మెక్‌లాడ్, జార్జియా ప్లిమ్మర్, ఇసాబెల్లా గేజ్, ఎజ్జీ షార్ప్, ఎమ్మా ఇర్విన్, కేట్ ఇర్విన్, పెగ్ లాగెబర్గ్, నటాశా కోరీ, కోల్ నైట్, అబిగలీ హాటెన్

భారత జట్టుకి న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది టీమిండియా. అయితే ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపే భారత జట్టు, ఐసీసీ టోర్నీల విషయానికి వచ్చేసరికి కివీస్ ముందు నిలవలేకపోతోంది...

2019 వన్డే వరల్డ్ కప్‌ గ్రూప్ స్టేజీలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ చేతుల్లో ఓడి నిరాశగా వెనుదిరిగింది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియాని న్యూజిలాండ్ కంటే ఎక్కువగా వరుణుడు ఇబ్బంది పెట్టాడు...

2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు చిత్తుగా ఓడింది. అంతకుముందు మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఎదురైన పరాభవాన్ని మరిచిపోని టీమిండియా, కివీస్‌తో మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది...

2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది భారత జట్టు. వర్షం కారణంగా ఆగుతూ సాగుతూ 6 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకి వాతావరణం, వర్షం, పిచ్, లక్ ఏదీ కలిసి రాలేదు...

మళ్లీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు, న్యూజిలాండ్‌తో తలబడబోతోంది. అది కూడా సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే. వుమెన్స్ క్రికెట్‌లో భారత జట్టుపై న్యూజిలాండ్‌కి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా వరల్డ్ కప్‌లో ఇండియా మహిళా జట్టు, న్యూజిలాండ్‌తో 11 సార్లు తలబడగా 2 సార్లు మాత్రమే విజయం సాధించగలిగింది..

అండర్19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా, యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. స్కాట్లాండ్‌పై 83 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించింది..

సూపర్ 6 రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిన భారత మహిళా అండర్19 జట్టు, శ్రీలంకతో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. నెట్ రన్‌రేట్ కారణంగా గ్రూప్ 1 టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది..