మహిళల టీ20 ఛాలెంజ్‌లో నిన్న సూపర్ నోవాస్ జట్టుపై గెలిచి మంచి జోరుమీదున్న వెలాసిటీకి చుక్కలు చూపించింది ట్రైయల్ బ్లేజర్స్. సోఫియా ఎక్లేస్టోన్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి, గయక్వాడ్ రెండేసి వికెట్లు తీయడంతో 47 పరుగులకే ఆలౌట్ అయ్యింది వెలాసిటీ.

యంగ్ ఓపెనర్ సఫాలీ వర్మ 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేయగా వాట్ 3, కెప్టెన్ మిథాలీ రాజ్ 1, సుష్మావర్మ 1, సునే లూయిస్ 4, శిఖా పాండే 10, కస్పేరక్ 11, జహనర అలం 1పరుగులు చేయగా సుశ్రీ దిబ్యదర్శిని, వేదా కృష్ణమూర్తి, ఏక్తా బిస్త్ డకౌట్ అయ్యారు.

48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒకే ఒక్క వికెట్ కోల్పోయి చేధించింది ట్రైయల్‌బ్లేజర్స్. కెప్టెన్ స్మృతి మంధాన 6 పరుగులకే అవుట్ అయినా డియాండ్రా డాటిన్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు, రిచా ఘోష్ 10 బంతుల్లో 13 పరుగులు చేసింది.

శనివారం ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ గెలిస్తే వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్ మధ్య ఫైనల్ జరుగుతుంది. సూపర్ నోవాస్ భారీ విజయం సాధిస్తే రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ పోటీదారులు నిర్ణయించబడతారు.