ICC Women's ODI World cup 2022: సౌతాఫ్రికాపై 2 పరుగుల తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు... ప్రాక్టీస్ మ్యాచ్ రిజల్ట్ విషయంలో ఐసీసీ గందరగోళం...
ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 4 నుంచి ఆరంభమయ్యే వరల్డ్ కప్ కోసం వార్మప్ మ్యాచులు మొదలయ్యాయి. సౌతాఫ్రికా వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వుమెన్స్ జట్టు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది...
తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 23 బంతుల్లో 12 పరుగులు చేసి రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగింది. యషికా భాటియా 78 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసింది...
దీప్తి శర్మ 3 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుట్ కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 114 బంతుల్లో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి ఆకట్టుకుంది...
రిచా ఘోష్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేయగా స్నేహ్ రాణా 28 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. పూజా వస్తాకర్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేయగా జులన్ గోస్వామి 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ డకౌట్ అయ్యింది.
245 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా మహిళా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ లోరా వాల్వార్ట్ 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 పరుగులు చేయగా తజ్మన్ బ్రిట్స్ 12 బంతులాడి డకౌట్ అయ్యింది. లారా గుడ్‌ఆల్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేయగా కెప్టెన్ సునే లూజ్ 98 బంతుల్లో 6 ఫోర్లతో 86 పరుగులు చేసింది...
మిగ్‌నాన్ డు ప్రీజ్ 8 పరుగులు చేయగా మరిజాన్నే కాప్ 39 బంతుల్లో ఓ ఫోర్‌తో 31 పరుగులు చేసింది. చోలే ట్రైయాన్ 6 పరుగులు చేసి అవుట్ కాగా త్రిశా చెట్టి 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీయగా స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, మేఘనా సింగ్ తలా ఓ వికెట్ తీశారు...
అయితే ఈ మ్యాచ్ రిజల్ట్ విషయంలో ఐసీసీ బాగా కంఫ్యూజ్ అయ్యింది. తొలుత భారత జట్టు విధించిన లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించినట్టు పోస్టు చేసిన ఐసీసీ, ఆ తర్వాత కొద్దిసేపటికి భారత జట్టు 1 పరుగు తేడాతో గెలిచిందని పోస్టు చేసింది...
ఆఖరికి భారత జట్టుకి 2 పరుగుల తేడాతో విజయం దక్కిందని పోస్టు చేసింది. జరిగింది కేవలం వార్మప్ మ్యాచ్ అయినా వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ విషయంలో ఐసీసీ ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది...
దీంతో స్వయంగా భారత ప్లేయర్ యషికా భాటియా, సోషల్ మీడియా ద్వారా భారత జట్టు 2 పరుగుల తేడాతో గెలిచిందని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది...
