Asianet News TeluguAsianet News Telugu

కళతప్పిన మహిళల ఐపీఎల్: స్టార్స్ లేకుండానే షార్జాలో నవంబర్ 4న ఆరంభం

  ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్ల హంగామా లేకుండా చాలా చప్పగా సాగనుందని బీసీసీఐ.. అభిమానుల గుండెల్లో బాంబ్‌ పేల్చింది.

Womens IPL 2020: Tournament To Take Place Without Stars
Author
Hyderabad, First Published Oct 13, 2020, 1:54 PM IST

మహిళల ఐపీఎల్‌ (మహిళల టీ20 చాలెంజ్‌ ట్రోఫీ) మరింత కళ తప్పనుంది. తొలి రెండు సీజన్లలో విదేశీ ముద్దుగుమ్మలతో అలరించిన మహిళల ఐపీఎల్‌.. మూడో సీజన్‌లో అభిమానులకు తీవ్ర నిరాశ మిగల్చనుంది. 

గత సీజన్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని సూపర్‌నోవాస్‌ జట్టు మిథాలీరాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీని ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్‌ బ్యాటర్‌ స్మతీ మంధాన కెప్టెన్సీలో ట్రయల్‌బ్లేజర్స్‌ లీగ్‌ దశలోనే నిష్కమించింది. 

ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌లో పోటీపడే జట్ల సంఖ్యను నాలుగు పెంచాలని అనుకున్నా.. మూడు జట్లతోనే నిర్వహించనున్నారు. జట్ల సంఖ్య పెంపు సంగతి పక్కనపెడితే.. విదేశీ క్రికెటర్ల హంగామా లేకుండా చాలా చప్పగా సాగనుందని బీసీసీఐ.. అభిమానుల గుండెల్లో బాంబ్‌ పేల్చింది.

ఆ ముగ్గురికే కెప్టన్సీ పగ్గాలు..

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌కు సమాంతరంగా మహిళల ఐపీఎల్‌ నిర్వహిస్తామని బీసీసీఐ తొలుత ప్రకటించింది. మహిళల ఐపీఎల్‌ నవంబర్‌ 4-9న నిర్వహించనున్నారు. నవంబర్‌ 10 ఐపీఎల్‌ టైటిల్‌ పోరు జరుగనున్న సంగతి తెలిసిందే.  

నీతూ డెవిడ్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే మూడు జట్లను ఎంపిక చేసింది. వెలాసిటీ, సూపర్‌నోవాస్‌, ట్రయల్‌బ్లేజర్స్‌ జట్లకు మిథాలీరాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతీ మంధానలు కెప్టెన్సీ వహించనున్నారు.  తొలి మ్యాచ్‌లో గత సీజన్‌ ఫైనలిస్ట్‌లు వెలాసిటీ, సూపర్‌నోవాస్ తలపడనున్నాయి.

యుఏఈకి చేరుకుంటారిలా..

మూడు జట్లు అక్టోబర్‌ మూడో వారాంలోగా యుఏఈకు చేరుకోనున్నాయి. ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు అనుసరించిన నిబంధనలనే మహిళల ఐపీఎల్‌కూ వర్తించనున్నాయి. భారత్‌లో మూడుసార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన క్రికెటర్లకే యుఏఈ విమానం టికెట్‌ లభించనుంది. 

అక్కడ అందరినీ ఒకే హోటల్‌లో ఉంచి ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ చేయనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా మహిళా క్రికెటర్లు అందరూ ఆటకు దూరమైన నేపథ్యంలో యుఏఈలో వీలైనన్ని ఎక్కవు ప్రాక్టీస్‌ సెషన్లు ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తోంది. 

అంతకుముందు ముంబయిలో వారం రోజుల పాటు 30 మంది భారత మహిళా క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అక్టోబర్‌ 22న మహిళా క్రికెటర్లు యుఏఈకి బయల్దేరనున్నారు.

బబుల్‌లోకి ప్రవేశం ఇలా..

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌తో  ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఢీకొడుతోంది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ అక్టోబర్‌ 25 నుంచి ఆరంభం కానుంది. దీంతో మహిళల క్రికెట్‌ స్టార్స్‌ ఎవరూ మహిళల ఐపీఎల్‌లో కనువిందు చేసే అవకాశం లేకుండా పోయింది. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ స్టార్‌ క్రికెటర్లు ఎవరూ మహిళల ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోయారు. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడని ఇంగ్లాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు మాత్రమే యుఏఈకి వస్తున్నారు. స్టార్‌ క్రికెటర్లు దూరమవుతున్న మహిళల ఐపీఎల్‌లో భారత క్రికెటర్లే ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios