Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఆసియా కప్ 2022: జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ... శ్రీలంక ముందు...

శ్రీలంక ముందు 151 పరుగుల టార్గెట్‌ని పెట్టిన భారత మహిళా జట్టు... 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్‌...

Womens Asia Cup T20 2022: Jamimah Rodrigues half century helped team India decent total against SL
Author
First Published Oct 1, 2022, 2:39 PM IST

గాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిచ్చర పిడుగు జెమీమా రోడ్రిగ్స్, వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీని హాఫ్ సెంచరీతో మొదలెట్టింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మ ఫెయిల్ అయినా జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించి భారత జట్టుకి ఓ మోస్తరు స్కోరు అందించగలిగింది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగుల స్కోరు చేయగలిగింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన స్మృతి మంధాన, సుగంధిక కుమారి బౌలింగ్‌లో నీలాక్షి డి సిల్వకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన షెఫాలీ వర్మను రణసింగే పెవిలియన్ చేర్చింది....

4 ఓవర్లు ముగిసే సమయానికి 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌‌తో కలిసి మూడో వికెట్‌కి 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది జెమీమా రోడ్రిగ్స్. 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యింది. 

రణసింగే బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకొచ్చి స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న జెమీమా రోడ్రిగ్స్, టీ20ల్లో 8వ అర్ధ శతకాన్ని అందుకుంది...

22 ఏళ్ల 26 రోజుల జెమీమా రోడ్రిగ్స్, అతి చిన్న వయసులో వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు బంగ్లాదేశ్ ప్లేయర్ ఫర్గానా హుక్ 25 ఏళ్ల 79 రోజుల వయసులో హాఫ్ సెంచరీ బాది, ఆసియా కప్ టీ20లో అర్ధ శతకం బాదిన పిన్న వయస్కురాలిగా ఉండింది...

53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ని లంక కెప్టెన్ చమరీ ఆటపట్టు క్లీన్ బౌల్డ్ చేసింది. ఆసియా కప్ ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచింది రోడ్రిగ్స్. ఇంతకుముందు 2012లో హంకాంగ్‌పై అనుజా పాటిల్ 50 పరుగులు చేయడమే ఆరంగ్రేట మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన...

టీ20 వుమెన్స్ ఆసియా కప్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ది రెండో అత్యధిక వ్యక్తిగత ప్రదర్శన. ఇంతకుముందు 2018లో మలేషియాపై 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్. 2016లో పాకిస్తాన్‌పై 73, శ్రీలంకపై 62 పరుగులు చేసి మూడు, నాలుగు స్థానాల్లోనూ ఉంది మిథాలీ... 

వికెట్ కీపర్ రిచా ఘోష్ 6 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి రణసింగే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా పూజా వస్త్రాకర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది. హేమలత 10 బంతుల్లో 13 పరుగులు చేయగా దీప్తి శర్మ ఆఖరి బంతికి సింగిల్ తీసి భారత స్కోరును 150 మార్కు కు చేర్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios