Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో సంచలనం... పాకిస్తాన్‌ని చిత్తు చేసిన థాయిలాండ్...

థాయిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్... వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో చరిత్ర సృష్టించిన థాయ్ అమ్మాయిలు... 

Womens Asia Cup 2022: Thailand beats Pakistan creates History
Author
First Published Oct 6, 2022, 2:20 PM IST

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో పెను సంచలనం క్రియేట్ చేసింది థాయిలాండ్ క్రికెట్ టీమ్. పసి కూన జట్టుగా ఆసియా కప్ 2022 టోర్నీకి మొదలెట్టిన థాయిలాండ్ వుమెన్స్ జట్టు, పాకిస్తాన్‌ని చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేసింది...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది థాయిలాండ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మునీబా ఆలీ 14 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేయగా కెప్టెన్ బిస్మా మరూఫ్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుటైంది...

అమీన్ 64 బంతుల్లో  6 ఫోర్లతో 56 పరుగులు చేయగా నిదా దర్ 22 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. అయేషా నసీం 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో  8 పరుగులు చేయగా అలియా రియాజ్ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసింది. ఎక్స్‌ట్రాల రూపంలో 11 పరుగులు పాక్ ఖాతాలో చేయడం విశేషం...

117 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన థాయిలాండ్ వుమెన్స్ జట్టుకి శుభారంభం అందించారు అంపైర్లు. తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత వికెట్ కీపర్ నన్నాపట్ కోచరోంకై 24 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి అవుట్ అయ్యింది. 

కెప్టెన్ నరోమోల్ చైవాయ్ 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేయగా చనిడా సుత్తిరుయంగ్ డకౌట్ అయ్యింది. సోర్నారిన్ తిప్పోచ్ 3, పన్నితా మయా 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఓపెనర్‌గా వచ్చిన నథకన్ ఛాంతమ్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసింది...

అయితే థాయిలాండ్ విజయానికి 12 పరుగులు కావాల్సిన దశలో నథకమ్ ఛాంతమ్ అవుటైంది. ఛాంతమ్ అవుట్ అయ్యే సమయానికి థాయిలాండ్ విజయానికి 8 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు కావాల్సి రాగా డియానా బైగ్ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఫోర్ బాదిన రోజనన్ కన్నో ఆ తర్వాత విజయానికి కావాల్సిన పరుగులను తేలిగ్గా రాబట్టింది. 

పాకిస్తాన్‌ వుమెన్స్ చరిత్రలో థాయిలాండ్ చేతుల్లో ఇదే మొట్టమొదటి పరాజయం. అంతేకాకుండా థాయిలాండ్‌‌ వుమెన్స్‌కి ఆసియా కప్‌లో ఇదే అత్యధిక ఛేదన. తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన పాకిస్తాన్, థాయిలాండ్ చేతుల్లో ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది... 

Follow Us:
Download App:
  • android
  • ios