Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ ఆసియా కప్ 2022: వర్షం కారణంగా ఆగిన మ్యాచ్... టీమిండియాకి వరుసగా రెండో విజయం.

వర్షం కారణంగా నిలిచిన ఆట... డీఎల్‌ఎస్ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చిన అంపైర్లు... మలేషియాపై 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు...

Womens Asia Cup 2022 India vs Malaysia: Team India registers 2nd Victory
Author
First Published Oct 3, 2022, 4:25 PM IST

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్‌ఎస్ విధానం ద్వారా టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం అందుకున్నట్టు తేల్చారు అంపైర్లు...

182 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన మలేషియా వర్షం అంతరాయం కలిగించే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేయగలిగింది. మొదటి ఓవర్2లోనే మలేషియా కెప్టెన్ వినిఫ్రెడ్ దురైసింగంని దీప్తి శర్మ డకౌట్ చేయగా 1 పరుగుల చేసిన విన్ జులియా, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యింది...

మస్ ఎలీసా 17 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు, ఎల్సా హంటర్ 1 పరుగు చేసి క్రీజులో ఉన్నారు. వర్షం ఎంతకీ తగ్గకపోగా పెరుగుతూ ఉండడంతో మ్యాచ్‌ని రద్దు చేసిన అంపైర్లు... డీఎల్‌ఎస్ విధానం ప్రకారం 5.2 ఓవర్లు ముగిసే సమయానికి మలేషియా చేయాల్సిన పరుగుల కంటే 31 పరుగులు వెనకబడి ఉండడంతో టీమిండియాని విజేతగా తేల్చారు...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ విజయం అందుకున్న టీమిండియా, మలేషియాతో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘనకి ఓపెనర్‌గా అవకాశం కల్పించింది. 

షెఫాలీ వర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సబ్బినేని మేఘన, టీమిండియాకి అదిరిపోయే ఆరంభాన్ని అందించింది. 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన సబ్బినేని మేఘన, టీ20 కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసింది...


39 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, నూర్ దనియా సుహెడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. కిరణ్ నవ్‌గిరే డకౌట్ కాగా రాధా యాదవ్ 4 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 19 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా దయాలన్ హేమలత 4 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసింది...

శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత మహిళా జట్టు, తర్వాతి మ్యాచ్‌లో యూఏఈతో తలబడుతుంది. బంగ్లాదేశ్ వుమెన్స్ జట్టు, థాయిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం అందుకోగా పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది మలేషియా...
 

Follow Us:
Download App:
  • android
  • ios