ICC Women's T20 World cup 2023: సెమీ ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా... రికార్డు స్థాయిలో ఏడోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి ఆస్ట్రేలియా... హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ వృథా..

టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ కల మరోసారి చేజారింది. గత రెండు టీ20 వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు తీవ్రంగా నిరాశపరిస్తే.. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత మహిళా జట్టు, సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. 173 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకి పరిమితమై 5 పరుగుల తేడాతో ఓడింది. ఫీల్డింగ్‌లో చేసిన తప్పులు, క్యాచ్ డ్రాప్‌లకు భారీ మూల్యం చెల్లించుకుంది భారత మహిళా జట్టు.. 

 భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. షెఫాలీ వర్మ 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అవుట్ కాగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 5 బంతుల్లో 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచింది. యస్తికా భాటికా కూడా 4 పరుగులు చేసి రనౌట్ కావడంతో 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా..

ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి నాలుగో వికెట్‌కి 69 పరుగులు జోడించారు. 24 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో అవుటైంది. ఆ తర్వాత రిచా ఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్..

34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ దురదృష్టశాత్తు రనౌట్ అయ్యింది. రెండో పరుగు కోసం ప్రయత్నించిన హర్మన్‌ప్రీత్ కౌర్, క్రీజులోకి వచ్చే సమయంలో బ్యాటు మట్టిలో కూరుకుపోయి కదలకపోవడంతో రనౌట్ కావాల్సి వచ్చింది. ఇదే మ్యాచ్‌ని మలుపు తిప్పింది.

రిచా ఘోష్ 14, స్నేహ్ రాణా 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. టీమిండియా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 28 పరుగులు కావాల్సి రావడంతో టీమిండియా గెలుస్తుందని భావించారంతా. అయితే 18వ ఓవర్‌లో 11 పరుగులు రాగా 19వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే చేసి స్నేహ్ రాణా వికట్ కోల్పోయింది భారత జట్టు..

దీంతో ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 16 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి 3 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి రాధా యాదవ్ అవుట్ కాగా ఐదో బంతికి సింగిల్ వచ్చింది. చివరి బంతికి 10 పరుగులు రావడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది. దీప్తి శర్మ ఫోర్‌తో ముగించినా ఫలితం లేకపోయింది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. 26 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన అలీసా హీలి... రాధా యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యింది. 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆసీస్. భారత ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెత్ మూనీ, 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది..

బెత్ మూనీ 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ డ్రాప్ చేసింది షెఫాలీ వర్మ. షెఫాలీ చేతుల్లో పడిన బంతి, జారి కింద పడి బౌండరీ లైన్ దాటడంతో ఫోర్ కూడా వచ్చేసింది. 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన బెత్ మూనీ, శిఖా పాండే బౌలింగ్‌లో షెఫాలీ వర్మకే క్యాచ్ ఇచ్చి అవుటైంది..

అష్‌లీ గార్నర్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన గ్రేస్ హారిస్, శిఖా పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా ఆస్ట్రేలియా స్కోరు వేగం మాత్రం తగ్గలేదు...

34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది మెగ్ లానింగ్. ఆస్ట్రేలియా ఆఖరి 10 ఓవర్లలో 103 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు తీయగా దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.