India vs Pakistan: పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా... హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్.. 

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాని ఘన విజయంతో ఆరంభించింది. పాకిస్తాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది భారత మహిళా జట్టు. చిచ్చర పిడుగు జెమీమా రోడ్రిగ్స్ 38 బంతుల్లో 8 ఫోర్లతో 53 పరుగులు చేయగా యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా 58 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమిండియాకి అద్భుత విజయం అందించారు.. 


150 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి శుభారంభం దక్కింది. వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఓపెనర్లు ఆచితూచి ఆడారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన యషికా భాటియా, సదియా ఇక్బాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది. 25 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, నస్రా సంధు బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది...

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుటైంది. 93 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ కలిసి ఏ మాత్రం కంగారు లేకుండా ఓవర్‌కి ఓ ఫోర్ బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 

టీమిండియా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 40 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. అయితే 17వ ఓవర్‌లో 2 ఫోర్లతో 13 పరుగులు, 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్.. 19వ ఓవర్‌లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టి మ్యాచ్‌ని ముగించారు. 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మొదటి 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసిన పాక్, భారత ఫీల్డర్ల మిస్ ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్‌ల కారణంగా ఆఖరి 6 ఓవర్లలో 66 పరుగులు రాబట్టగలిగింది...

6 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన జావెరియా ఖాన్‌ని దీప్తి శర్మ అవుట్ చేసింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఆ తరవ్ాత కెప్టెన్ బిస్మా మరూఫ్‌తో కలిసి రెండో వికెట్‌కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించింది ఓపెనర్ మునీబా ఆలీ..

14 బంతుల్లో ఓ పోర్‌తో 12 పరుగులు చేసిన మునీబా ఆలీ, రాధా యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యింది. ఆ తర్వాత నిదా దర్‌ని డకౌట్ చేసింది పూజా వస్త్రాకర్.18 బంతుల్లో 11 పరుగులు చేసిన సిద్రా ఆమీన్, రాధా యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది.

68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ జట్టును బిస్మా మరూఫ్, అయేషా నసీం కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 81 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 పరుగులు చేయగా అయేషా నసీం 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసింది...

భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు తీయగా దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.