CWC 2022: సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓడిన పాకిస్తాన్... 6 పరుగుల తేడాతో సౌతాఫ్రికాకి ఉత్కంఠ విజయం... వన్డే వరల్డ్ కప్ 2022లో పాక్‌కి హ్యాట్రిక్ ఓటములు...
ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడింది... తాజాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ దాకా పోరాడి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది పాకిస్తాన్...
టాస్ గెలిచి, సౌతాఫ్రికాకి బ్యాటింగ్ అప్పగించింది పాకిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది... లీజెల్లీ లీ 2 పరుగులు చేసి అవుట్ కాగా తజ్మీన్ బ్రిట్స్ 18 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును వాల్వరెట్, సునీ లూజ్ కలిసి ఆదుకున్నారు.
91 బంతుల్లో 10 ఫోర్లతో 75 పరుగులు చేసిన వాల్వరెట్‌ను ఫాతిమా అవుట్ చేయగా సునీ లూజ్ 102 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరింది...
డూ ప్రీజ్ డకౌట్ కాగా, మరిజాన్నే క్యాప్ 7 పరుగులు చేసింది. చోలే ట్రైయాన్ 38 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 31 పరుగులు, టి చెట్టీ 26 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి సౌతాఫ్రికాకి ఈ మాత్రం స్కోరు అందించగలిగారు. పాకిస్తాన్ బౌలర్లలో ఫాతిమా సనా, గుల్మాన్ ఫాతిమా మూడేసి వికెట్లు తీశారు...
సిడ్రీ ఆమెన్ 12 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ బిస్మా మరూఫ్ మొదటి బంతికే డకౌట్ అయ్యింది. 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. నహీదా ఖాన్ 71 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేయగా, ఒమైమా సోహైల్ 104 బంతుల్లో 7 ఫోర్లతో 65 పరుగులు చేసింది.
నిదా దర్ 72 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి రనౌట్ కాగా అలియా రియాజ్ డకౌట్ అయ్యింది. ఫతిమా సనా 9 పరుగులు చేయగా సద్రా నవాజ్ 11 పరుగులు చేసింది. డియానా బేగ్ 13 పరుగులు చేసింది.
సద్రా నవాజ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ విజయానికి 3 ఓవర్లలో 30 పరుగులు కావాలి. 48వ ఓవర్‌లో ఫోర్ బాది 8 పరుగులు రాబట్టింది నిదా దర్. ఆఖరి 2 ఓవర్లలో 22 పరుగులు రావాల్సి ఉండగా డియానా బేగ్ రెండు వరుస ఫోర్లు బాదింది. దీంతో 10 బంతుల్లో 14 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది పాకిస్తాన్...
అయితే అనవసర పరుగుకి ప్రయత్నించి నిదా దర్ అవుట్ కాగా, ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి 2 పరుగులు రాగా, ఆ తర్వాతి బంతికి డియానా బేగ్‌ను అవుట్ చేసిన షబ్మిన్ ఇస్మాయిల్, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు ఇవ్వలేదు.
ఆఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి రావడంతో సింగిల్ తీయడానికి ప్రయత్నించి ఫాతిమా రనౌట్ కావడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కి 217 పరుగుల వద్ద తెర పడింది. సౌతాఫ్రికా జట్టుకి 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం దక్కింది... వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ మహిళా జట్టు, పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్‌లో ఉంది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కి వన్డే వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 17వ పరాజయం...
